- ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నేత
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలు దృష్టి పెట్టాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ మూడేండ్లు కనిపించకపోయినా.. గల్లీగల్లీలో కేసీఆర్పాటలు వినిపిస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్వ్యాఖ్యానించారు. కేసీఆర్ బయటకు రాకపోయినా.. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని చెప్పారు. కోదాడ, సూర్యాపేట దాకా సాగునీళ్లు ఇచ్చిన కేసీఆర్‌నే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ఆయన మళ్లీ అధికారంలోకి రావాలంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్జిల్లా ఇనుగుర్తికి చెందిన పలువురు నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసగాళ్లనే ప్రజలు నమ్ముతారని రేవంత్‌రెడ్డి ముందే చెప్పారని గుర్తు చేశారు. పాత రోజులు తెస్తానని ముందే చెప్పి అలాగే చేశారన్నారు. రేవంత్ ఎంతైనా నిజాయతీ కలిగిన మోసగాడని ఎద్దేవా చేశారు. ప్రజలు పాలిచ్చే బర్రెను వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు. అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోతదని ముందే చెప్పామని తెలిపారు.
2028లో కేసీఆరే సీఎం అని సర్వేలు చెబుతున్నయ్..
నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా కేసీఆర్ సీఎం అవుతారని ప్రజలు అనుకున్నారని, కానీ, రాష్ట్రమంతా అలాగే అనుకోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సమయం ఇవ్వాలని చెప్పారని, కానీ, మూడేండ్లవుతున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. నాట్లు వేసే సమయానికి కేసీఆర్ రైతుబంధు ఇచ్చేవారని, కానీ, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తానని చెప్పి.. ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని, కేసీఆర్ సీఎం అవుతారంటున్నాయని స్పష్టం చేశారు. ఈ నెల 28 నుంచి గ్రాడ్యుయేట్స్ అంతా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఏంటో చెప్పడానికే ఈ ఎన్నికలని, కాంగ్రెస్ దోపిడీ, అవినీతి పాలన పోవాలంటే అంతా గ్రాడ్యుయేట్స్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
ఎన్ రోల్‌మెంట్‌పై ఫోకస్ చేయండి..
రాష్ట్రంలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లను మోసం చేసిందన్న ఆగ్రహం వారిలో తీవ్రంగా ఉందన్నారు. చదువుకున్నవారు తమ సమస్యలతోపాటు తమ కుటుంబాలు, అన్నదాతలు, మహిళలు, యువత సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నారని చెప్పారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. అయితే, ఆ వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈసారి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
