- రజకులు ఐలమ్మ స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమించాలి
- చాకలి ఐలమ్మజయంతి సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి
రవీంద్రభారతి, వెలుగు: బీసీలంతా ఐక్యంగా పోరాడితే తమ హక్కులను సాధించుకోవచ్చని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చాకలి ఐలమ్మ భూస్వాముల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారో.. అదే స్ఫూర్తితో రజకులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలకే పరిమితం కాకుండా చట్టసభల ఎన్నికల్లోనూ బీసీలు విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.
రజక సోదరులు తమ సమస్యలు, హక్కుల కోసం గొప్పగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎన్నో ఏళ్లుగా కొనసాగిన వివక్ష కారణంగానే వారికి చట్టపరమైన రిజర్వేషన్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం బీసీల్లోనూ మంచి నాయకత్వం, పెద్ద నాయకులు ఉన్నారని, వారంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే వారి జనాభాపై స్పష్టమైన లెక్కలు తేలాలని అన్నారు.
కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాబోయే జనాభా లెక్కల్లో బీసీ జనాభా వివరాలను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సమగ్ర కులగణన నిర్వహించామని, శాసనసభ తీర్మానం ద్వారా బీసీ జనాభా లెక్కల అంశాన్ని కేంద్రానికి పంపించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి బీసీ జనాభా లెక్కలను కేంద్ర జనగణనలో చేర్చాలని ఐక్యంగా తీర్మానించినట్టు తెలిపారు. కేంద్రం గతంలో బీసీ జనాభా వివరాలను సేకరిస్తామని ప్రకటించినప్పటికీ.. జనగణన సర్వే ఫారంలో ఎస్సీ, ఎస్టీ వివరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.
విద్యతోనే రజక సమాజం అభివృద్ధి: ఆర్.కృష్ణయ్య
రజకుల్లో పుట్టుకతోనే ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అన్యాయాన్ని ఎదిరించిన చరిత్ర రజకుల సొంతమన్నారు. రజక సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కులవృత్తికే పరిమితం కాకుండా రాజ్యాధికారం దిశగా రజక సమాజం ముందుకు సాగాలని అన్నారు. నిరంకుశ నిజాం పాలన, దేశ్‌ముఖ్‌ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడారని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ అన్నారు.
ఐలమ్మ పోరాటం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చాకలి ఐలమ్మ నుంచి పోరాడే తత్వాన్ని భవిష్యత్ తరాలు పుణికిపుచ్చుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఐలమ్మ పౌరుషం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. దేశంలో సుమారు 60 శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. రిజర్వేషన్ల కోసం బీసీలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బసవరాజు సారయ్య, పీసీసీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.
