- ట్రేడ్ ట్రూస్ మరో రెండు నెలల పొడిగింపునకు అంగీకారం
- కమ్యూనికేషన్ వేగవంతం చేసి సైనిక వివాదాలకు చెక్
- యూఎస్ నుంచి కోటి టన్నుల బొగ్గు దిగుమతికి డ్రాగన్ ఓకే
- వాషింగ్టన్‌లో ముగిసిన అమెరికా, చైనా శిఖరాగ్ర సమావేశం
వాషింగ్టన్: అమెరికా, చైనా దేశాధినేతల మధ్య జరిగిన మూడు రోజుల శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఈ నెల 23 నుంచి 25 వరకు వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను వైట్‌హౌస్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించాయి. సమావేశంలో ఎలాంటి భారీ సంచలనాలు లేకపోయినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైనిక వివాదాల నివారణ, ట్రేడ్ సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఇరు దేశాలు సానుకూల అడుగులు వేశాయి. టెక్నాలజీ భద్రత కోసం ప్రత్యేకంగా ఏ ఏఐ సేఫ్టీ ఛానెల్‌ను ఏర్పాటు చేయాలని ట్రంప్, షీ జిన్‌పింగ్ నిర్ణయించారు.
దీనిపై నవంబర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరగనున్నాయి. అలాగే, సైనిక రంగంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, రెండు దేశాల అధికారులు ఎప్పుడూ మాట్లాడుకునేలా కమ్యూనికేషన్((హాట్‌లైన్ లేదా ప్రత్యేక ఛానెల్)ను వేగవంతం చేయాలని అంగీకరించాయి. వాణిజ్య పరంగా కూడా ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. సుమారు రూ. 2.87 లక్షల కోట్ల (30 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులపై టారిఫ్‌ల తగ్గింపు ప్రతిపాదనలపై కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.
ట్రేడ్ ట్రూస్(రెండు దేశాల మధ్య నడుస్తున్న టారిఫ్‌ల పోరును తాత్కాలికంగా ఆపివేయడం) మరో రెండు నెలలు పొడిగించాలని, ఈ కాలంలో ఎలాంటి కొత్త పన్నుల పెంపు ఉండకూడదని అంగీకరించారు. రాబోయే రెండేండ్లల్లో అమెరికా నుంచి చైనా కనీసం 1 కోటి మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాగే, అరుదైన భూసారాల (రేర్ ఎర్త్స్) సరఫరాను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేయనున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశమూ టోల్ వసూలు చేయకూడదని ఇరు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఫెంటానిల్ మత్తు పదార్థానికి వాడే రసాయనాల నియంత్రణపై చైనా తీసుకున్న చర్యలను అమెరికా అభినందించింది.
స్నేహపూర్వకంగా సాగిన భేటీ
ట్రంప్ తొలి విడత పాలనలో అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ తీవ్రంగా నడిచింది. రెండు దేశాలు ఒకరి ఉత్పత్తులపై మరొకరు భారీగా పన్నులు విధించుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈసారి వాషింగ్టన్ భేటీలో మాత్రం ట్రంప్, జిన్‌పింగ్‌తో చాలా స్నేహపూర్వకంగా, సానుకూలంగా మాట్లాడారు. పాత గొడవలను పక్కన పెట్టి కలిసి పనిచేద్దామనే ధోరనితో కనిపించారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం బీజింగ్‌కు తిరుగుపయనమయ్యారు. నవంబర్‌లో చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరిగే అపెక్ శిఖరాగ్ర సమావేశంలో, అలాగే ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సులలో ఇరు నేతలు మళ్లీ కలవనున్నారు.
