- సోనియా, మన్మోహన్ చొరవతోనే తెలంగాణ కల సాకారం
- దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మౌన ముని
- లోక్‌సభలో ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తాలన్న రేవంత్ రెడ్డి
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మౌనముని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈ గడ్డ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని శనివారం సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత దేశం గర్వించదగ్గ జాతిరత్నమైన మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతోనే ఈ విగ్రహావిష్కరణ చేపట్టినట్టు తెలిపారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పదవులకు వన్నె తెచ్చిన మన్మోహన్.. 1991లో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్థలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచే సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సముచితమని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ చదువును ప్రాథమిక హక్కుగా మారుస్తూ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ), పరిపాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) తీసుకొచ్చారన్నారు. పేదవాడికి ఏడాదిలో కనీసం 100 రోజుల పనిని హక్కుగా కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) ప్రవేశపెట్టారని వివరించారు. అటవీ ప్రాంతాల్లో బతికే ఆదివాసీలు, గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-2006ను అమలు చేసి అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత వారిద్దరికే దక్కుతుందని రేవంత్‌రెడ్డి కొనియాడారు. బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టానికి స్వస్తి పలికి, 2013లో యూపీఏ సర్కారు తెచ్చిన పునరావాస, భూసేకరణ చట్టం తెచ్చారన్నారు. గతంలో ప్రాజెక్టులు కట్టి గ్రామాలు మునిగిపోతే కేవలం భూమి ఉన్నవారికే పరిహారం ఇచ్చేవారని, భూమిలేని నిరుపేదలు, కులవృత్తులు, చేతివృత్తుల వారి బతుకులు రోడ్డున పడేవని గుర్తుచేశారు. ఈ అన్యాయాన్ని రూపుమాపేందుకు నిర్వాసితులందరికీ గ్రామసభల ఆమోదం, పక్కా పునరావాసం, పరిహారం తప్పనిసరి చేస్తూ 2013 చట్టాన్ని రూపొందించారని తెలిపారు సంక్షోభ సమయాల్లోనూ రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల హక్కులను కాపాడిన గొప్ప పాలనాదక్షుడిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారని సీఎం వివరించారు.
తెలంగాణకు స్వాతంత్ర్యం అందించింది నెహ్రూ, పటేల్
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసి స్వాతంత్య్రం అందించిన ఘనత నెహ్రూ, పటేల్‌దైతే.. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌దని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుపై మన్మోహన్ చేసిన సంతకాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ-పునరావాస చట్టం 2013 వంటివి తీసుకొచ్చి, భూమిలేని పేదలకు కూడా నష్టపరిహారం దక్కేలా హక్కు కల్పించిన ఘనత సోనియా, మన్మోహన్‌దని చెప్పారు. మౌనమునిలా దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన ఆయన జ్ఞాపకం ఢిల్లీలో నిలిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన పేరుతో ఢిల్లీలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా లోక్‌సభలో ప్రస్తావించాలని తమ పార్టీ ఎంపీలకు సూచిస్తున్నట్టు తెలిపారు. మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ముఖ్యమంత్రిగా తనకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఆర్థిక నిపుణుడు మోహన్ గురుస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలతో పాటు పలు యూనివర్సిటీల వీసీలు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
