హైదరాబాద్ , వెలుగు: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో కీలక స్కీమ్‌కు శ్రీకారం చుడుతున్నది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ఉచితంగా అందించనున్నది.
ఈ స్కీమ్ ను గురువారం సెక్రటేరియెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ స్కీమ్ ఉద్దేశం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మహిళల ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని చెప్పారు.
