హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మండల రిసోర్స్ సెంటర్లు(ఎంఆర్సీలు), స్కూల్ కాంప్లె క్స్‌లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-–27 విద్యా సంవత్సరానికి అకడమిక్ సపోర్ట్ కింద మొత్తం రూ.13.48 కోట్లు కేటా యించింది. ఈమేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 630 ఎంఆర్సీలు ఉండగా.. ఒక్కో దానికి రూ.90 వేల చొప్పున రూ.5.67 కోట్లు ఇచ్చారు. అలాగే 1,817 స్కూల్ కాంప్లెక్స్‌లకు ఒక్కోదానికి రూ.43 వేల చొప్పున రూ.7.81 కోట్లు కేటాయించారు.
ఈ నిధులను టీఎల్ఎం కిట్లు, స్టేషనరీ, ఇంటర్నెట్, కరెంట్ బిల్లులు, టాయిలెట్ల నిర్వహణతో పాటు స్కూల్ కాంప్లె క్స్ సమావేశాలకు ఉపయోగించాలని అధికారులు సూచించారు. నిధుల వినియోగంపై విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. ఎంఆర్సీలు, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని విద్యార్థులు, టీచర్లు, స్కూళ్ల వసతుల వివరాలను హెడ్‌మాస్టర్లు తమ లాగిన్‌తో యూడైస్ ప్లస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, విద్యార్థుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, బయోమెట్రిక్ అప్‌డేట్లను కూడా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
