టీచర్లు ఏడాది బడికి రాకుంటే ఇంటికే.. అనుమతి లేకుండా ఆబ్సెంట్ అయితే సర్వీస్ నుంచి తొలగింపు

టీచర్లు ఏడాది బడికి రాకుంటే ఇంటికే.. అనుమతి లేకుండా ఆబ్సెంట్ అయితే సర్వీస్ నుంచి తొలగింపు
  • డుమ్మా టీచర్లు, సిబ్బందిపై విద్యాశాఖ సీరియస్ 
  • ఐదేళ్లు దాటితే రాజీనామా చేసినట్టేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విధులు ఎగ్గొట్టి పత్తా లేకుండా తిరుగుతున్న టీచర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ రెడీ అయింది. ఇకపై పర్మిషన్ లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.

 కంటిన్యూగా ఏడాది కాలానికి మించి డ్యూటీకి రాకపోతే నిబంధనల ప్రకారం వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లు, సిబ్బంది అనుమతి లేకుండా డుమ్మాలు కొడుతుండటంతో అకడమిక్ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. అందుకే అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆర్జేడీలు, డీఈఓలను విద్యా శాఖ ఆదేశించింది. 

నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగికీ వరుసగా ఐదేళ్లకు మించి ఎలాంటి సెలవులను మంజూరు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా టీచర్ లేదా స్టాఫ్ ఏడాది మించి అనుమతి లేకుండా రాకపోయినా, లేదా సెలవు ఉన్నా లేదా ఐదేళ్ల పాటు ఆబ్సెంట్ అయినా వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

 విదేశీ సర్వీసులో ఉండి గడువు ముగిసినా తిరిగి రాని వారికి కూడా ఇదే నిబంధన వర్తించనున్నది. ఇకపై చర్యలు ప్రారంభించడానికి వేచి చూడాల్సిన అవసరం లేదని, ఆబ్సెంట్‌‌‌‌ను గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చి, సీసీఏ రూల్స్ ప్రకారం విచారణ మొదలుపెట్టాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఆఫీసర్లపైనా నిఘా.. రిజిస్టర్లు మస్ట్ 

టీచర్లు విధులకు రాకపోయినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కూడా విద్యా శాఖ సీరియస్ అయింది. గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవడంలో హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలు జాప్యం చేస్తే.. సదరు అధికారులనే బాధ్యులను చేస్తూ వారిపై కూడా వేటు వేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. 

ప్రతి డీఈఓ ఆఫీసులో ఆబ్సెంట్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, అందులో ఎప్పటికప్పుడు వివరాలను అప్‌‌‌‌డేట్ చేయాలని ఆదేశించారు. గైర్హాజరు కాలాన్ని డైస్ నన్‌‌‌‌గా పరిగణించి, ఇంక్రిమెంట్లు, పెన్షన్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కోత విధించాలని పేర్కొన్నారు.