హైదరాబాద్: డిస్కం, జెన్ కో ప్రైవేటీకరణ ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో డిస్కం, జెన్ కోను ప్రైవేట్ చేయమని తేల్చిచెప్పారు. డిస్కం, జెన్ కోను ప్రైవేట్ పరం చేస్తామని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపర్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం (అక్టోబర్ 7) ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పారు.
ఎల్ నినో ప్రభావం వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జలవిద్యుత్ 2 వేల మెగావాట్ల ఉత్పత్తి తగ్గిందన్నారు. 2026, సెప్టెంబర్ 30న రాష్ట్రంలో అత్యధికంగా 19 వేల 500 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని చెప్పారు. సెప్టెంబర్ నెలలో పీక్ డిమాండ్ యావరేజ్‌గా 15 వేల మెగావాట్లుగా ఉందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నాలుగు వేల మెగావాట్ల డిమాండ్ పెరిగిందని వివరించారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
రాష్ట్రంలో విద్యుత్ సప్లైపై ప్రతిపక్షపక్షాలు బురద జల్లుతున్నాయని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేస్తోన్న విద్యుత్ సిబ్బంది ప్రశంసించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నామని మండిపడ్డారు. విద్యుత్ సప్లైపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో సర్కార్‌కు నష్టమని తెలిపారు. కోల్ సప్లై లేకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ ఎలా కట్టారని ప్రశ్నించారు. సింగరేణి నుంచి గ్రేడ్ 9 రకం బొగ్గు సప్లై చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. యాదాద్రి ప్లాంట్‌కు అసలు డీపీఆర్ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న 14 బ్లాక్లులు మాతపడ్డాయని అన్నారు.
