హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,892 మెగావాట్ల పీక్ పవర్ డిమాండ్ నమోదైందని చెప్పారు. దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిన డిమాండ్ ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని భట్టి తెలిపారు. కర్ణాటకలో పీక్ పవర్ డిమాండ్ 15 వేల మెగావాట్లలోపే ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో విద్యుత్ వినియోగం, డిమాండ్ భారీగా పెరిగిందన్నారు.
విద్యుత్ సిబ్బందికి అభినందనలు
పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న సిబ్బందిని భట్టి విక్రమార్క అభినందించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్‌ల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు.
తప్పుడు సమాచారంతో గందరగోళం
విద్యుత్ రంగానికి సంబంధించి కొందరు నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన వాస్తవాలను, డాక్యుమెంటరీ ఆధారాలను ప్రజలకు వివరించేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.
