హైదరాబాద్: రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ సేవలు అందుతున్నప్పటికీ.. వాటికి అదనంగా మొబైల్ ఫోన్ ద్వారానే వ్యవసాయ సంబంధిత సమస్యలకు సలహాలు, సమాచారాన్ని పొందే అవకాశం కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ (KHC) ద్వారా అందుబాటులో ఉంది. రైతులు తమ సమస్యలను నేరుగా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.
పంటకు తెగుళ్లు సోకినా, ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలో తెలియకపోయినా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై సందేహాలున్నా రైతులు 1800-180-1551 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. తెలుగులోనే తక్షణ సలహాలు, సమాచారం అందించే ఈ సేవలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, వారంలో ఏడు రోజులూ అందుబాటులో ఉంటాయి.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ సేవలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రైతుల కోసం ఈ కేంద్రం హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్, సంచాలకుల కార్యాలయంలో పనిచేస్తోంది.
కిసాన్ హెల్ప్‌లైన్ ద్వారా అందే సేవలు
- నిపుణుల సలహాలు: వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి పంటల సాగు, సమస్యలపై మార్గదర్శకత్వం.
- ప్రభుత్వ పథకాల సమాచారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు తదితర వివరాలు.
- పంటలపై సలహాలు: పంటలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆధునిక సాగు పద్ధతులపై సూచనలు.
- ఇన్‌పుట్ సమాచారం: విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెట్ ధరలకు సంబంధించిన సమాచారం.
- పశుపోషణ సలహాలు: పశువుల ఆరోగ్యం, పోషణకు సంబంధించిన సూచనలు.
- వాతావరణ సమాచారం: వాతావరణ శాఖ సూచనల ఆధారంగా వాతావరణ పరిస్థితులు, విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు.
- ఎరువుల యాప్ సమాచారం: కేంద్ర ఎరువుల యాప్‌కు సంబంధించిన సాంకేతిక సందేహాల నివృత్తి.
రైతుల ఫిర్యాదులకూ పరిష్కారం
వ్యవసాయ పథకాలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను కూడా రైతులు ఇదే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చు. ‘రైతుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కూడా ఈ డిజిటల్ వేదికలో అందుబాటులో ఉంది. రైతులు తెలిపిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్ సహకరిస్తుంది.
కిసాన్ హెల్ప్‌లైన్ సేవలు మారుమూల గ్రామాల్లోని ప్రతి రైతుకూ తెలిసేలా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు) విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ సూచించారు.రైతులు పంటలు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ పథకాలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సందేహాలు ఉన్నప్పుడు 1800-180-1551 టోల్‌ఫ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
