2036 ఒలింపిక్స్‌పై భారత్ మాస్టర్ ప్లాన్.. అహ్మదాబాద్‌ నుంచి బిడ్ ప్రక్రియ షురూ!

2036 ఒలింపిక్స్‌పై భారత్ మాస్టర్ ప్లాన్.. అహ్మదాబాద్‌ నుంచి బిడ్ ప్రక్రియ షురూ!

2036 Olympics: 2036 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల ఆతిథ్య వేదికను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రకటించిన నగరాలు, దేశాల జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సాదరంగా స్వాగతించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Amdavad) కేంద్రంగా భారత్ తన ఒలింపిక్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తోంది. గత 18 నెలలుగా ఐఓసీతో జరిపిన నిరంతర సంప్రదింపుల ద్వారా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంది.

రైజింగ్ టు గెదర్ నినాదంతో ముందుకు..

* భారతదేశం ఎంచుకున్న రైజింగ్ టుగెదర్ దృక్పథం.. క్రీడల ద్వారా దేశం రూపాంతరం చెందడం, ఒలింపిక్ ఉద్యమ భవిష్యత్తు కలిసికట్టుగా కొనసాగాలనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

* భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం కేవలం ఒక గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించడమే కాకుండా, క్రీడలను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడానికి ఒక చారిత్రక అవకాశం.

* కోట్లాది మంది యువతను కేవలం క్రీడలను వీక్షించే స్థాయి నుంచి వాటిని ఆచరించే స్థాయికి తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

ఒలింపిక్ ఉద్యమానికి నూతన శకం

ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా, అత్యుత్తమ డిజిటల్ నెట్‌వర్క్ కలిగిన భారత్‌కు ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కితే అది ఒలింపిక్ ఉద్యమానికి ఒక కొత్త శకం అవుతుందని ఐఓసీ భావిస్తోంది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలోకి ఒలింపిక్స్ ప్రవేశించడం వల్ల కొత్త అథ్లెట్లు, కొత్త ప్రేక్షకులు, కొత్త భాగస్వాములు ఒలింపిక్ కుటుంబానికి లభిస్తారు. భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ఈ వేడుక ప్రపంచానికి చాటిచెప్పనుంది.

పీటీ ఉష, మన్సుఖ్ మాండవ్య హర్షం: 

ఐఓఏ అధ్యక్షుడు పీటీ ఉష మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ కంటున్న కలలను ఐఓసీ గుర్తించడం మాకు అత్యంత గర్వకారణం. రైజింగ్ టు గెదర్ అనేది కేవలం నినాదం కాదు, అంకితభావంతో కూడిన శక్తి.. అక్టోబర్ చివరి వరకు ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు మా ఆశయాలను ప్రదర్శించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.

►ALSO READ | ICC ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లే తోపు.. వన్డేల్లో గిల్, టీ20ల్లో ఇషాన్ టాప్!

కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మాట్లాడుతూ.. క్రీడలు మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలవు.. ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా మిలియన్ల మంది యువతను క్రీడల వైపు ప్రోత్సహించవచ్చు.. దేశంలో ప్రతి సామాజిక వర్గానికి క్రీడా పరివర్తనను తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. త్వరలోనే ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఎదుట భారత్ తన అధికారిక ప్రణాళికను ప్రదర్శించనుంది.