ICC ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లే తోపు.. వన్డేల్లో గిల్, టీ20ల్లో ఇషాన్ టాప్!

ICC ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లే తోపు.. వన్డేల్లో గిల్, టీ20ల్లో ఇషాన్ టాప్!

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనతో కెరీర్లోనే ది బెస్ట్ కెరీర్ ర్యాంక్‌ను సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. తొలిసారిగా ఐసీసీ టీ20 టాప్ 10లోకి దూసుకొచ్చాడు.

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత హవా: 

ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపరుచుకుని 786 రేటింగ్స్‌తో 7వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విధంగా టాప్ 10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు ఉండటం మన క్రికెట్ ఆధిపత్యానికి నిదర్శనం.

టాప్ 5 బ్యాటర్లు:

* ఇషాన్ కిషన్ (భారత్) - 902 రేటింగ్స్

* అభిషేక్ శర్మ (భారత్) - 887 రేటింగ్స్

* షాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - 818 రేటింగ్స్

* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) - 793 రేటింగ్స్

* జాస్ బట్లర్ (ఇంగ్లాండ్) - 789 రేటింగ్స్

రోహిత్, సూర్య సరసన శ్రేయస్: 

లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 రన్స్) అజేయ శతకంతో వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రేయస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన మూడో భారత కెప్టెన్‌గా శ్రేయస్ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2024), సూర్యకుమార్ యాదవ్ (2025) ఉండగా.. విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా ముంబైకి చెందిన క్రికెటర్లే కావడం గమనార్హం. కాగా, 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అయ్యర్, ఇప్పటి వరకు 68 మ్యాచ్‌ల్లో 1615 రన్స్ (స్ట్రైక్ రేట్ 140.07) బాదాడు. ఇందులో 1 సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

వన్డే ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ దూకుడు: 

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో 7 స్థానాలు ఎగబాకి 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు.  ప్రస్తుతం ఆయన 653 రేటింగ్స్‌తో టాప్ 10లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 841 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ రెండో స్థానానికి చేరుకున్నారు. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (మూడో స్థానం), రోహిత్ శర్మ (నాలుగో స్థానం) టాప్-5లో నిలిచారు. 

వన్డే ర్యాంకింగ్స్ టాప్ 5 బ్యాటర్లు:

* శుభ్‌మన్ గిల్ (భారత్) - 841 రేటింగ్స్

* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) - 794 రేటింగ్స్

* విరాట్ కోహ్లీ (భారత్) - 781 రేటింగ్స్

* రోహిత్ శర్మ (భారత్) - 770 రేటింగ్స్

* ఇబ్రహీమ్ జర్దాన్ (ఆఫ్ఘనిస్థాన్) - 719 రేటింగ్స్