ఢిల్లీలో  కూలిన ఐదంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద పలువురు.!

ఢిల్లీలో  కూలిన ఐదంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద పలువురు.!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భవనం కూలింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం ముందు భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే సహాయక, రక్షణ చర్యలు చేపట్టారు.

 అక్టోబర్ 7న మధ్యాహ్నం సుమారు 3:15 గంటలకు భవనం కూలినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కు సమాచారం అందింది. వెంటనే నాలుగు ఫైర్ సర్వీస్ వాహనాలను ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ భవనంలో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.  భవనం ముందు భాగమే కూలిపోయినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటన జరిగి నెల రోజులు కూడా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సత్య నికేతన్‌లో భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది.  తాజాగా సీమాపురిలో జరిగిన ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం వెలువడలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.