1,100 కోట్ల పీఎఫ్ స్కామ్! ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు

1,100 కోట్ల పీఎఫ్ స్కామ్! ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు
  • ఆడిటింగ్, ఆధార్ ​సీడింగ్‌‌‌‌‌‌‌‌లో బయటపడ్డ బాగోతం
  • రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన వందలాది ఏజెన్సీలు
  • అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. 
  • కఠిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు సిఫార్సు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో​ ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ బాగోతం బట్టబయలైంది. వేలాది మంది ఉద్యోగుల భవిష్య నిధికి ఎసరు పెడుతూ వందలాది ఏజెన్సీలు సాగించిన పీఎఫ్ స్కామ్ వెయ్యి కోట్లు దాటింది. ఔట్​సోర్సింగ్​ ఏజెన్సీలు ఏకంగా రూ.1,100 కోట్లకు పైగా పీఎఫ్ నిధులు దారి మళ్లించినట్టు ప్రభుత్వ ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌తోపాటు ఆధార్ సీడింగ్  పరిశీలనలో వెలుగుచూసింది. 

ఉద్యోగులకు చేరాల్సిన సొమ్మును ఏజెన్సీలు సొంతానికి వాడుకోవడంతోపాటు ఘోస్ట్ (బోగస్) ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్టు తేలింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు  సిఫార్సు చేసింది. 

వేతన శ్లాబుల వారీగా దగా.. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఏజెన్సీల ద్వారా సుమారు 1.60 లక్షల మంది ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా అసలు పీఎఫ్ ఖాతాలే లేకపోవడం లేదా జమ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిబంధనల ప్రకారం.. బేసిక్ వేతనం రూ. 15,600 ఉన్న ప్రతి ఉద్యోగి తరఫున ఏజెన్సీకి ఈపీఎఫ్  రూ. 2,028 (13%), ఈఎస్ఐ రూ. 507  (3.25% ), ఏజెన్సీ కమిషన్  రూ. 624 ( 4%), జీఎస్టీ రూ. 3,377 (18% )  కలిపి మొత్తంగా రూ. 22,136  చెల్లిస్తుంది. కానీ ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ రూ. 1,872(12%) , ఈఎస్ఐ రూ. 117 (0.75% ) కోత విధిస్తూ నికరంగా రూ. 13,611 మాత్రమే చేతికి ఇస్తున్నారు.

 అదేవిధంగా బేసిక్ వేతనం రూ. 19,500 ఉన్న ఉద్యోగిపై ప్రభుత్వం రూ. 26,979 వెచ్చి స్తుంటే, ఉద్యోగికి పీఎఫ్ రూ.1,800 కట్ చేసు కొని నికరంగా రూ.17,404 ఇస్తున్నారు. అలాగే, రూ.22,750 బేసిక్ ఉన్న సీనియర్ ఉద్యోగిపై ప్రభుత్వం రూ. 31,092 వెచ్చిస్తుంటే చేతికి రూ. 20,579 మాత్రమే ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే యజమాని పీఎఫ్ వాటా,  ఉద్యోగి జీతం నుంచి కట్ చేసే పీఎఫ్ మొత్తం కలిపి  ఉదాహరణకు రూ. 15,600 శ్లాబ్‌‌‌‌‌‌‌‌కు నెలకు రూ. 3,900 చొప్పున ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓకి జమ చేయకుండా ఏజెన్సీలు నొక్కేశాయి.

వందల కోట్ల మేత

మొత్తం 1.60 లక్షల మంది ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ సిబ్బంది వేతన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పరిశీలిస్తే, ప్రభుత్వం ప్రతినెలా ఒక ఉద్యోగిపై శ్లాబుల ఆధారంగా రూ. 22,136 నుంచి రూ. 31,092 వరకు వెచ్చిస్తుండటంతో, ఏటా మొత్తం ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ వేతనాల బిల్లే రూ. 4,500 కోట్లకు పైగా దాటుతోంది. ఇందులో పీఎఫ్ జమకాని 60 శాతానికి పైగా ఉన్న ఉద్యోగుల ప్రాథమిక లెక్కలు తీస్తే, రూ. 15,600 బేసిక్ పొందే ఒక్కో ఉద్యోగికి ఏటా జమ కావాల్సిన పీఎఫ్ నిధులు (రూ. 3,900 × 12 నెలలు) రూ. 46,800 గా తేలుతోంది. 

ఈ ప్రకారం బాధితులకు సంబంధించి ఏజెన్సీలు ప్రతినెలా దారిమళ్లిస్తున్న పీఎఫ్ మొత్తమే రూ. 31 కోట్లకు పైగా ఉండగా, ఏడాదికి ఈ దోపిడీ రూ. 375 కోట్లకు పైగా చేరుతోంది. కొన్నేండ్ల కాలపరిమితిని లెక్కలోకి తీసుకుంటే, ఒక్కో ఉద్యోగికి జమకావాల్సిన పీఎఫ్ సొమ్ము (వడ్డీ కలపకుండా) రూ. 4.68 లక్షల దాకా ఉంటుంది.  

ప్రతియేటా జరిగిన చెల్లింపులు, ఆడిట్ నివేదికలను పరిశీలిస్తే కుంభకోణం విలువ రూ. 1,100 కోట్లకు పైగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతినెలా పీఎఫ్ మినహాయింపు పేరుతో రసీదులు ఇస్తున్నప్పటికీ, అసలు ఖాతాల్లో డబ్బు పడకపోవడం వెనుక ఏజెన్సీల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

ఘోస్ట్ ఉద్యోగుల దందా.. బోర్డు తిప్పేసిన వందలాది ఏజెన్సీలు

కేవలం పీఎఫ్ ఎగవేతతోనే ఏజెన్సీల ఆగడాలు ఆగలేదు. ప్రభుత్వ అనుమతించిన పోస్టుల సంఖ్యకు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పొంతన లేకపోవడంతో ‘ఘోస్ట్ (బోగస్) ఉద్యోగుల’ దందా బయటపడింది. ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో అసలు లేని ఉద్యోగుల పేర్లతో ప్రతినెలా కోట్లాది రూపాయల వేతనాలు, పీఎఫ్ బిల్లులు డ్రా చేసినట్టు స్పష్టమైంది. ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పులు బయటపడి, విచారణ ఉచ్చు బిగుస్తుండటంతో ఇప్పటికే వందలాది ప్రైవేటు ఏజెన్సీలు బోర్డు తిప్పేసి రాత్రికి రాత్రే ఉడాయించాయి.  మరోవైపు, ప్రతినెలా ఏజెన్సీలు పీఎఫ్ చలాన్లు, ఈసీఆర్  ప్రతులు సమర్పిస్తున్నాయా? లేదా? అని కనీసం తనిఖీ చేయాల్సిన పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కఠిన చర్యలకు ప్రభుత్వ సిఫార్సు

ఏజెన్సీలు, ఔట్​ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న అక్రమాలపై  రాష్ట్ర ప్రభుత్వం  కఠినంగా స్పందించింది. పీఎఫ్ చెల్లింపుల్లో నిబంధనలు ఉల్లంఘించిన, బోర్డు తిప్పేసిన ఏజెన్సీలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, ఆస్తులు జప్తు చేసి అయినా నిధులు రాబట్టాలని పీఎఫ్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు  సిఫార్సు చేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పీఎఫ్ చట్టం సెక్షన్ 14బీ, 7ఏ కింద రికవరీ చర్యలు వేగవంతం చేయాలని కోరింది. అయితే, కేవలం ఏజెన్సీలపై చర్యలతో సరిపెట్టకుండా, శాఖల వారీగా బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.  

ఏజెన్సీల రద్దుతో ఉద్యోగులకు భారీ లబ్ధి 

మరోవైపు మధ్యవర్తులుగా ఉన్న ప్రైవేట్ ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా లబ్ధి చేకూరుతుందని  గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏజెన్సీ వ్యవస్థ రద్దయితే ఏజెన్సీ కమిషన్ 4%,  దానిపై విధించే 18% జీఎస్‌‌‌‌‌‌‌‌టీ భారం తప్పుతుంది. 

దీనివల్ల రూ. 15,600 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి ఏజెన్సీ ద్వారా ప్రస్తుతం రూ. 13,611 మాత్రమే చేతికి వస్తుండగా, ఏజెన్సీ రద్దయితే ఏకంగా రూ. 17,601.. అంటే అదనంగా రూ. 3,990 లబ్ధి అందుతుంది. అలాగే.. రూ. 19,500 బేసిక్ ఉన్న ఉద్యోగి జీతం ప్రస్తుతం ఉన్న రూ. 17,404  నుంచి ఏకంగా రూ. 22,299 కి పెరుగుతుంది. 

ఇక రూ. 22,750 బేసిక్ వేతనం గల ఉద్యోగి నికర వేతనం రూ. 20,579 నుంచి రూ. 26,232కు పెరుగుతుంది. ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్లు, జీఎస్టీల రూపంలో వృథా అవుతున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాక, పీఎఫ్ దారిమళ్లింపులు, దోపిడీలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.