అమెరికాలో పెరుగుతున్న అప్పుల భారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది 2వ త్రైమాసికంలో అంటే మూడు నెలల కాలంలో అమెరికన్ల క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు 1.7 శాతం పెరిగి ఏకంగా 1.26 ట్రిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.12 లక్షల కోట్లకు చేరుకున్నట్లు న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. గత ఏడాది నమోదైన 1.28 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.12లక్షల 16వేల కోట్ల రికార్డు క్రెడిట్ కార్డ్ అప్పుల స్థాయికి ఇది చాలా దగ్గరగా ఉంది.
పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణ ప్రభావంతో చాలా అమెరికన్ ఫ్యామిలీస్ పూటగడవక ప్రతీ నెలా జీతం వచ్చే వరకు అప్పుల మీదే ఆధారపడుతున్నాయట. ఈ త్రైమాసికంలోనే అగ్రిగేట్ క్రెడిట్ కార్డ్ పరిమితులు కూడా 85 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 8లక్షల 7వేల 500 కోట్లు పెరిగాయి. లెండర్లు మరింత క్రెడిట్ అందుబాటులోకి తెస్తుండటంతో.. అమెరికన్లు తమ రోజువారీ ఖర్చుల కోసం ప్లాస్టిక్ మనీని విపరీతంగా వాడేస్తున్నట్లు వెల్లడైంది.
అయితే ఈ భారీ అప్పుల పెరుగుదలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 90 రోజులు దాటిన డెలినాక్వెన్సీ రేట్లు 7.6 శాతం నుంచి 12.8 శాతానికి పెరిగినప్పటికీ.. కొత్తగా డిఫాల్ట్ అవుతున్న వారి రేటు మాత్రం స్థిరంగానే ఉందని న్యూయార్క్ ఫెడ్ స్పష్టం చేసింది. లెండర్లు ఎక్కువ కాలం పాటు పాత, రద్దు చేసిన బకాయిలను రిపోర్ట్ చేస్తుండటం వల్లే స్టాక్ డెలినాక్వెన్సీ రేటు పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి అమెరికన్ ప్రజలు క్రెడిట్ కార్డుల్లో అప్పులు వాడుతున్నప్పటికీ.. చెల్లింపుల్లో పెద్ద ఎత్తున ఎగవేతలు లేవని డేటా చెబుతోంది. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన జీవన ఖర్చులు, కాంపౌండింగ్ వడ్డీల కారణంగా ఈ స్వల్పకాలిక అప్పులు త్వరలోనే కుటుంబ బడ్జెట్‌లను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని అచీవ్ కో-సీఈఓ బ్రాడ్ స్ట్రో హెచ్చరించారు.
ALSO READ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది
భవిష్యత్తులో ఈ భారీ బ్యాలెన్స్‌లు కాస్తా చెల్లించలేని బకాయిలుగా మారితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనివల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సామాన్య అమెరికన్లకు భవిష్యత్తులో ఈ ఆర్థిక భారం ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు.
