నీలంగా మారే పాలు... ఏడాదికి ఒక్కసారే తెరుచుకునే తలపులు: భారత్‌లోని మోస్ట్ మిస్టీరియస్ నాగదేవత ఆలయాలు !

నీలంగా మారే పాలు... ఏడాదికి ఒక్కసారే తెరుచుకునే తలపులు: భారత్‌లోని మోస్ట్ మిస్టీరియస్ నాగదేవత ఆలయాలు  !

మన దేశంలో పాములను కేవలం ప్రాణజీవులుగానే కాకుండా ప్రత్యక్ష దైవాలుగా లేదా సర్ప దేవతలుగా పూజించే సాంప్రదాయం శతాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా నాగపంచమి, మహాశివరాత్రి వంటి పండగల సమయంలో సర్ప ఆలయాలు, నాగ దేవతల ఆలయాలు  భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే, కొన్ని దేవాలయాలకు ఉండే ప్రత్యేకమైన ఆచారాలు, నమ్మకాలు వాటిని మిగతా ఆలయాల కంటే చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఈ 5 ప్రముఖ సర్ప క్షేత్రాల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం:

1. నాగచంద్రేశ్వర ఆలయం 
 ఈ ఆలయం ప్రత్యేకత సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే (నాగపంచమి నాడు) తెరుచుకుంటుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయ మూడో అంతస్తులో ఈ నాగచంద్రేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు తక్షక నాగేంద్రుడు నివసిస్తాడని భక్తుల నమ్మకం.

సాధారణంగా విష్ణుమూర్తి శేషతల్పం పై పడుకుని కనిపిస్తారు. కానీ ప్రపంచంలోనే ఏకైక వింతగా, ఇక్కడ శివపార్వతులు పడగ విప్పిన పాముపై కూర్చుని ఉంటారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ అరుదైన విగ్రహాన్ని నేపాల్ నుంచి తెచ్చారని చెబుతారు.

2. మన్నరసాల నాగరాజ ఆలయం  
కేరళలోని అలప్పుజ జిల్లాలో ఉన్న ఈ ఆలయం సర్పారాధనకు చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లలు లేని దంపతులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ ఆలయంలో మరో పెద్ద ప్రత్యేకత ఏంటంటే... ఇక్కడ ముఖ్యమైన  పూజలు నిర్వహించేది ఒక మహిళా పూజారిణి. 

3. నాగరాజ ఆలయం
తమిళనాడులోని నాగర్‌కోయిల్ పట్టణానికి ఈ పురాతన ఆలయం పేరు మీదుగానే ఆ పేరు వచ్చింది. ఇక్కడి గర్భగుడిలో ఉండే నాగరాజు దేవుడి రూపం ఇసుకతో నిర్మితమై ఉంటుంది. ఇక్కడి దేవుడి ప్రసాదం కూడా తడి ఇసుకే. దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే 'కాలసర్ప దోషాలు' తొలగిపోతాయని నమ్ముతారు.

4. నాగవాసుకి ఆలయం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర గంగా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. నాగపంచమి రోజున ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ నాగవాసుకి దేవుడిని దర్శించుకుంటే కాలసర్ప దోష భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

5. తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయం
తమిళనాడులోని ఈ ఆలయంలో పరమశివుడు నాగనాథస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇది నవగ్రహ క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాహు కాలంలో రాహు దేవునికి పాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో విగ్రహంపై పోసిన పాలు నీలం రంగులోకి మారిపోవడం, అది నేలపైకి కారిన తర్వాత మళ్లీ సాధారణ తెల్ల రంగులోకి రావడం ఇక్కడి అత్యంత అద్భుతమైన మహత్యం!