తాకట్టు పెట్టిన బంగారం కొట్టేసిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్

 తాకట్టు పెట్టిన బంగారం కొట్టేసిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్

బంగారం బయట తాకట్టు పెడితే ఏం అవుతుందో అనే భయం.. మార్వాడీ దగ్గర తాకట్టు పెడితే వడ్డీలు భరించలేం.. ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర పెడితే మాయం చేస్తారేమో అనే ఆందోళన.. ఈ క్రమంలోనే సురక్షితం.. భరోసా అనే ధీమాతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారు జనం. మా బంగారానికి భరోసా ఉంటుందనే ఆలోచనతో బంగారం పెట్టి డబ్బులు అప్పు తీసుకున్నారు.. తీరా అప్పు అంతా కట్టేసి బంగారం తిరిగి ఇవ్వమంటే.. బంగారం లేదు అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఇదెక్కడో జరిగింది కాదు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో జరిగిన బాగోతం. మహబూబాబాద్ సిటీలోని ఇండియన్ బ్యాంకులో జరిగిన బంగారం దోపిడీ వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ పట్టణంలో ఇండియన్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి చాలా మంది కస్టమర్లు అప్పు తీసుకున్నారు. వీరిలో 22 మందికి చెందిన  బంగారం మాయం అయ్యింది. నెలనెలా ఆడిట్ నిర్వహించటం బ్యాంకులో ఆనవాయితీ. ఈ క్రమంలోనే జూలై నెలకు సంబంధించిన ఆడిట్ జరిగింది. ఈ సమయంలోనే తాకట్టు పెట్టిన బంగారం మాయం అయినట్లు బయటపడింది. బ్యాంక్ ఉన్నతాధికారులు విచారణ చేయగా.. ఇది అసిస్టెంట్ మేనేజర్ పని అని తేలింది. లాకర్లలో చూస్తే బంగారం లేదు. విచారణ చేస్తే బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఈ బంగారాన్ని కొట్టేసినట్లు.. సొంతానికి వాడుకున్నట్లు నిర్థారణ అయ్యింది. దీనిపై పోలీసులకు కంప్లయింట్ చేశారు బ్యాంక్ మేనేజర్. 

22 మంది కస్టమర్లకు చెందిన 700 గ్రాముల బంగారం అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ తన సొంతానికి వాడుకున్నట్లు చెబుతున్నారు బ్యాంక్ సిబ్బంది. దీని విలువ 90 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు సిబ్బంది. ఈ క్రమంలోనే బ్యాంకు కస్టమర్లలో ఆందోళన నెలకొంది. కస్టమర్లు అందరూ బ్యాంకుకు వచ్చి తమ బంగారం ఉందా లేదా అని తనిఖీ చేసుకుంటున్నారు. 

బ్యాంకులో సురక్షితంగా ఉంటుందని అక్కడ బంగారం పెడితే.. వీళ్లు కూడా ఇలా మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు ఖాతాదారులు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.