స్మార్ట్ ఫోన్ వాడకం కొన్నేళ్ల నుంచి విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వాడకం పెరగడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో.. ఇన్ స్టా రీల్స్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని స్మార్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడే సాధనంగా కంటే కూడా వినోదాన్ని పంచే వస్తువుగా మారిపోయింది. అయితే.. కొందరు నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ వాడటం మొదలుపెట్టి నిద్ర పోయే ముందు కూడా స్మార్ట్ ఫోన్నే వాడుతుంటారు.
తిన్నా, పడుకున్నా.. చివరికి బాత్రూమ్ లోపలికి కూడా స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లి వాడుతుంటారు. ఇలా.. గంటలు గంటలు స్మార్ట్ ఫోన్నే చూస్తూనే గడిపేయడం ఎంత ప్రమాదమో సినీ నటి షకీలాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. 3 లక్షలు వైద్యానికి వదిలించుకుంటే గానీ తత్వం బోధ పడలేదు. ఆమె కూడా కొందరిలానే విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడింది.
సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఆమె ఆరోగ్యం కూడా నటనకు సహకరించే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లో ఉంటూ యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రాం రీల్స్ గంటల పాటు చూస్తూ కాలం గడిపింది. బెడ్పై ఒక పక్కకు తిరిగి అలా గంటలు గంటలు చూస్తూ ఉండటం, గేమ్స్ ఆడటం, సినిమాలు చూడటం వల్ల మెడ దగ్గర నరాలు దెబ్బతిన్నాయి.
పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే.. ఆమెకు మెడ దగ్గర ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్సకు సుమారు 3 లక్షలు ఖర్చయింది. డబ్బు పోవడమే కాదు ఆమె శారీరకంగా నరకం చూసింది. తన స్వీయ అనుభవంతో చెప్తున్నానని.. మొబైల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని, పిల్లలకు ఫోన్ను దూరంగా ఉంచాలని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇచ్చింది.
ఫోన్ అడిక్షన్ అవడానికి కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఫోన్ చూస్తుంటారు. ఆ అప్డేట్స్ కొన్ని గంటల తర్వాత చూసినా పోయేదేం లేదనే విషయం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ వాడకం తగ్గిపోతుంది. అంటే సోషల్ మీడియా వాడకాన్ని నెమ్మదిగా తగ్గించాలి. ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి మొబైల్ చూసే అలవాటు ఉంటుంది ఎక్కువమందికి. దాంతో ఫోన్ వాడకం ఎక్కువైపోతుంది.
కాబట్టి ఫోన్ లోని యాప్ నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి. రోజూ ఫోన్ను ఎంతసేపు వాడుతున్నారో? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెల్ ఫోన్ వాడే టైంను మెల్లగా తగ్గించాలి. స్మార్ట్ ఫోన్లో అలారం పెట్టుకోకుండా వేరే డివైజ్లో పెట్టుకోవాలి. వీలుంటే ప్రతి రోజు కొన్ని గంటలపాటు ఫోన్ను పక్కన పెట్టాలి. ఫోన్ వాడకం తగ్గించేందుకు మరో టెక్నిక్ ఇంటర్నెట్ ఆపేయడం.
