రాష్ట్రంలో శ్వేత విప్లవానికి తూప్రాన్ డెయిరీ నాంది: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి

రాష్ట్రంలో శ్వేత విప్లవానికి తూప్రాన్ డెయిరీ నాంది: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి
  • కో ఆపరేటివ్ విధానంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం  
  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి వెల్లడి
  • మెదక్‌‌‌‌ జిల్లాలో అమూల్ సాబర్​డెయిరీ ప్లాంట్‌‌‌‌కు శంకుస్థాపన 
  • హాజరైన మంత్రులు వివేక్‌‌‌‌, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, ఎంపీ రఘునందన్‌‌‌‌రావు

మెదక్/తూప్రాన్, వెలుగు: రాష్ట్రంలో శ్వేత విప్లవానికి తూప్రాన్‌‌‌‌ డెయిరీ నాంది పలుకుతుందని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. కో ఆపరేటివ్ విధానంతో రైతులతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.

మెదక్ జిల్లా తూప్రాన్​ పరిధి బ్రాహ్మణపల్లిలో అమూల్​సంస్థ రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్న సాబర్ డెయిరీ తెలంగాణ ప్లాంట్‌‌‌‌కు ఆదివారం మంత్రులు వివేక్​ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ..  వచ్చే 18 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

సరైన మార్కెటింగ్ సదుపాయాలు, నిల్వ, ప్రాసెసింగ్, బ్రాండింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు తగిన ఆదాయాన్ని పొందలేకపోతున్నారని, డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను మార్కెటింగ్​ చేయడంవల్ల రైతులకు మంచి ధర లభిస్తుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి సమష్టిగా పనిచేస్తే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చని సూచించారు. 

రాజకీయ జోక్యం పెరగడంతో సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయని, వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. సహకార ఉద్యమం కేవలం వ్యాపార నమూనా కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ సహకార వ్యవస్థను విస్తరించాలని సూచించారు.

1964లో గుజరాత్‌‌‌‌లో19 సహకార సంఘాలతో ప్రారంభమైన సాబర్ డెయిరీ రూ.10,500 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని వివరించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా 2029 నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 75 వేల పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 

తెలంగాణలోనూ 1,525 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న లోన్లతో పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తి పెంచాలని, దీనివల్ల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సాబర్ డెయిరీ చైర్మన్ శ్యామ్ లాల్ జీ పటేల్, కో ఆపరేటివ్ కమిషనర్ రాహుల్ రాజ్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ డెయిరీ నుంచే సీఎం బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌కు పాలు!: మంత్రి వివేక్‌‌‌‌
తూప్రాన్‌‌‌‌లో ప్రారంభించనున్న ఈ డెయిరీ నుంచి సీఎం బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్‌‌‌‌కు నాణ్యమైన పాలు అందజేసే అవకాశం ఉంటుందని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి బ్రేక్‌‌‌‌ఫాస్ట్ తో పాటు పాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణకు కేంద్రం సహకరించేలా చూడాలని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని కోరారు. 

అమూల్ ప్లాంట్‌‌‌‌ను చెన్నూరులో కూడా ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అక్కడ ప్లాంట్​ఏర్పాటు చేస్తే చెన్నూరు పరిసర ప్రాంతాలతోపాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలో కూడా డిమాండ్​ ఉంటుందని చెప్పారు. డెయిరీ గ్రామీణ ప్రాంతాల వెన్నెముకలాంటిదని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారికి ప్రోత్సాహకాలు, సహకారం అందిస్తున్నదని తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ విస్తరణకోసం మెదక్ జిల్లాలో అమూల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. 

ఈ ప్లాంట్​ ఏర్పాటుకు కేంద్రమంత్రులు అమిత్​షా, కిషన్‌‌‌‌రెడ్డి, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రులు వివేక్​ వెంకటస్వామి, శ్రీధర్ బాబు సహకరించారని చెప్పారు. రైతులు తమ రోజువారీ ఖర్చులకు ఎవరి మీద ఆధారపడకుండా పాడిని చేపట్టాలన్నారు.