పెద్దపల్లి గడ్డ... కాకా ఫ్యామిలీ అడ్డా.. నాలుగుసార్లు గెలిచి కేంద్రంలో పదవులు అధిష్ఠించిన వెంకటస్వామి

పెద్దపల్లి గడ్డ... కాకా ఫ్యామిలీ అడ్డా.. నాలుగుసార్లు గెలిచి కేంద్రంలో పదవులు అధిష్ఠించిన వెంకటస్వామి
  • అంతకుముందు మూడుసార్లు సిద్దిపేట ఎంపీగా ప్రాతినిధ్యం
  • తండ్రి బాటలోనే తనయులు వినోద్, వివేక్... రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు 
  • మూడోతరం లీడర్ గా వంశీకృష్ణ అరంగేట్రం.. పెద్దపల్లి ఎంపీగా విజయం
  • కాంగ్రెస్ నుంచి నాలుగు దశాబ్దాలుగా కాకా కుటుంబ సభ్యులదే గెలుపు
  • నేడు గడ్డం వెంకటస్వామి జయంతి

మంచిర్యాల, వెలుగు : సింగరేణి కోల్ బెల్డ్ ప్రాంతమైన పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు.. గడ్డం వెంకటస్వామి (కాకా). పెద్దపల్లితో గడ్డం ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, రాజకీయ పట్టు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. కాకా వెంకటస్వామి స్థాపించిన రాజకీయ సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు, మనుమడు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 

పెద్దపల్లి సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరఫున గడ్డం కుటుంబానికి తిరుగులేని రికార్డు ఉంది. ఈ సెగ్మెంట్ 1989 నుంచి కాకా ఫ్యామిలీకి కంచుకోటగా మారింది. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, పెద్దపల్లి ప్రజలు మాత్రం కాకా కుటుంబంపై ఉన్న నమ్మకంతో వరుస విజయాలు అందిస్తూ వస్తున్నారు.

ఏడు సార్లు పార్లమెంట్ కు.. 

రాజకీయాల్లో అత్యంత నిరాడంబరమైన నాయకుడిగా, కార్మికుల పక్షపాతిగా పేరుగాంచిన గడ్డం వెంకటస్వామి పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో నాలుగుసార్లు లోక్‌‌‌‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక, పునరావాస, జౌళి శాఖల మంత్రిగా సేవలందించిన కాకా సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి ప్రాంతాల్లోని వేలాది నిరుపేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడంతో గుడిసెల వెంకటస్వామిగా పేరు సంపాదించారు. 

అంతకుముందు మూడుసార్లు సిద్దిపేట ఎంపీగా ఎన్నికై మొత్తం ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికైన రికార్డును సొంతం చేసుకున్నారు. మూడుసార్లు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మెంబర్ గా, దళిత, వెనుకబడిన వర్గాల గళాన్ని ఢిల్లీ వేదికపై వినిపించారు. 2014 డిసెంబర్ 22న కాకా వెంకటస్వామి కన్నుమూసినప్పటికీ.. కార్మిక పక్షపాతిగా, గరీబోళ్ల లీడర్‌‌‌‌గా ఆయన పేరు జన హృదయాల్లో నిలిచిపోయింది. 

కాకా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో కొన్ని...

  • కాకా వెంకటస్వామి ప్రారంభించిన ప్రజాసేవ, వివేక్ వెంకటస్వామి ద్వారా ముందుకు సాగి వంశీకృష్ణ రూపంలో మూడో తరంలోనూ నిరంతరాయంగా కొనసాగుతోంది. 
  • పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనేది కాకా ఆశయం. అందుకోసమే హైదరాబాద్‌‌‌‌లో అంబేద్కర్ కాలేజీతో పాటు పలు విద్యాసంస్థలను స్థాపించి, ఎంతో మంది నిరుపేద దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందేలా చూస్తున్నారు.
  • ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులు, శ్రామికులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా కార్మిక పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడంలో కాకా వెంకటస్వామి కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయనను 'కార్మిక బాంధవుడు' అని పిలుస్తారు. 
  • సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం కాకా నిరంతరం పోరాడారు. సుమారు 1.2 లక్షల పైగా కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. 
  • డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారు. పేదల కోసం గొంతుకై నిలిచి, వారి హక్కులను సాధించిపెట్టారు. 
  • సమాజంలో ఆకలితో అలమటించే పేద ప్రజల కోసం ఆయన అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించి, పేదలకు అండగా నిలిచారు.
  • తెలంగాణ తొలిదశ (1969), మలిదశ ఉద్యమాల్లో కాకా వెంకటస్వామి పాత్ర ఎనలేనిది. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించి రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చిన అగ్రనేతల్లో కాకా ఒకరు.

తండ్రి వారసులుగా వినోద్​, వివేక్​..

కాకా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమారులు వినోద్, డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా పెద్దపల్లి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కాకా రెండో కుమారుడైన వివేక్ 2009 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న కాలంలో కోల్, స్టీల్ పార్లమెంటరీ కమిటీల్లో మెంబర్ గా పనిచేశారు. 

రామగుండంలో మూతపడిన ఆర్ఎఫ్ సీఎల్ రీ ఓపెనింగ్ ఆయన సాధించిన ఘనతే. మలి దశ తెలంగాణ ఉద్యమంలో వివేక్ పోషించిన పాత్ర మరువలేనిది. పార్లమెంట్‌‌‌‌లో కాంగ్రెస్ ఎంపీలను ఏకం చేయడంలో, విభజన బిల్లు ఆమోదం పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం చెన్నూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ, కేబినెట్‌‌‌‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కార్మికుల కష్టాలను తొలగిస్తూ తండ్రి బాటలో నడుస్తూ కార్మిక మంత్రిగా తనదైన శైలిలో అభివృద్ధిలో భాగం అవుతున్నారు. గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అక్రమ మైనింగ్ ను, ఇసుక మాఫియాను అరికట్టి ఖజానాకు ఆదాయాన్ని పెంచారు. 

తాత, తండ్రి అడుగు జాడల్లో..

తాత, తండ్రి, పెద్దనాన్న అడుగుజాడల్లో నడుస్తూ వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ సైతం పెద్దపల్లి రాజకీయాల్లోకి  విజయవంతంగా అరంగేట్రం చేశారు. 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 1,31,364 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్‌‌‌‌లో అడుగుపెట్టారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన తాత స్ఫూర్తితో సింగరేణి కార్మికుల యూనిఫాం ధరించి.. తాము ఎల్లప్పుడూ కార్మిక లోకానికి తోడుంటామన్న సందేశాన్ని ఇచ్చారు. 

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్లమెంట్‌‌‌‌లో స్థానిక సమస్యలపై గళం విప్పుతున్నారు. రైల్వే, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పోరాడుతున్నారు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కార్మిక క్షేత్రమైన రామగుండంలో ఎయిర్ పోర్ట్ ను సాధించారు.