‘దృశ్యం’ (Drishyam).. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మోహన్‌లాల్, జార్జ్‌కుట్టి. మలయాళంలో జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజ్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇదే కథను హిందీలో అజయ్ దేవగన్‌తో రీమేక్ చేయడంతో అక్కడ కూడా ‘దృశ్యం’కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ఇప్పుడు వచ్చిన ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్’ మాత్రం ఈ రెండు వెర్షన్ల మధ్య మరోసారి ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హిందీ సినిమాలను సాధారణంగా పెద్దగా పట్టించుకోని కొందరు మలయాళ ప్రేక్షకులే అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ను ప్రశంసిస్తున్నారు. అంతేకాదు.. మలయాళ ‘దృశ్యం 3’తో పోలిస్తే హిందీ వెర్షన్ 100 రెట్లు బెటర్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిందీ ‘దృశ్యం 3’కు మలయాళీలే ఫిదా
తాజాగా ఓ మలయాళ కంటెంట్ క్రియేటర్ ‘దృశ్యం 3’పై చేసిన కామెంట్లు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. గతంలో హిందీ ‘దృశ్యం’ సినిమాలపై తనకు అంతగా ఆసక్తి ఉండేది కాదని ఆయన తెలిపారు. కానీ మూడో భాగం చూసిన తర్వాత మాత్రం తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్, కథను ముగించిన విధానం తనను ఆకట్టుకుందని చెప్పారు.
హిందీ టీమ్ కథను తమదైన విధంగా ముందుకు తీసుకెళ్లి ఒక సాలిడ్ ఎండింగ్ ఇచ్చిందని ప్రశంసించారు. అతని వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. కొందరు మలయాళ నెటిజన్లు హిందీ వెర్షన్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తూ.. మలయాళ ‘దృశ్యం 3’ కంటే అజయ్ దేవగన్ సినిమా మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు.
►ALSO READ | OTT Review: లీగల్ డ్రామా, సస్పెన్స్ ట్విస్టులు.. OTTలో ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్
ఒక నెటిజన్ అయితే “మలయాళ దృశ్యం 3తో పోలిస్తే హిందీ వెర్షన్ 100 రెట్లు బెటర్” అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరికొందరు మలయాళ వెర్షన్ బిజినెస్ కోణంలో రూపొందినట్లు అనిపించిందని, హిందీ వెర్షన్ మాత్రం కథకు సరైన ముగింపు ఇచ్చిందని పేర్కొన్నారు.
కానీ మోహన్‌లాల్ ఫ్యాన్స్ మాత్రం..!
అందరూ హిందీ వెర్షన్‌కు జై కొట్టడం లేదు. మోహన్‌లాల్ అభిమానులు మాత్రం తమ హీరో నటనను ఎవరూ మ్యాచ్ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ పండించిన భావోద్వేగాలను కేవలం కథలోని ట్విస్టులతో పోల్చలేమని కొందరు అంటున్నారు. మంచి క్లైమాక్స్ ఉన్నంత మాత్రాన మోహన్‌లాల్ పెర్ఫార్మెన్స్‌ను తక్కువ చేసి చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కేవలం ఏ ‘దృశ్యం 3’ బెటర్? అనే దానిపై కాకుండా.. కథ, క్లైమాక్స్ ఒకవైపు.. నటన, ఎమోషన్ మరోవైపు అనే కోణంలో సాగుతోంది.
అసలు ట్విస్ట్ ఇక్కడే..
ఈ చర్చలో అసలు ఆసక్తికరమైన విషయం ఇదే. మొదటి రెండు హిందీ ‘దృశ్యం’ సినిమాలు మలయాళ చిత్రాలకు రీమేక్‌లుగా వచ్చాయి. కానీ మూడో భాగం మాత్రం మలయాళ కథను నేరుగా రీమేక్ చేయలేదు. దర్శకుడు అభిషేక్ పాఠక్ మూడో భాగం కోసం పూర్తిగా భిన్నమైన కథా మార్గాన్ని ఎంచుకున్నారు. గత రెండు భాగాల్లోని పాత్రలు, సంఘటనలను కొనసాగిస్తూనే.. కొత్త స్క్రీన్‌ప్లేతో కథను ముగించే ప్రయత్నం చేశారు. అజయ్ దేవగన్ కూడా ఈ కొత్త కథతో ముందుకు వెళ్లే ముందు మోహన్‌లాల్‌ను సంప్రదించినట్లు గతంలో వెల్లడించారు. మలయాళ స్టార్ నుంచి అంగీకారం, ఆశీస్సులు తీసుకున్న తర్వాతే హిందీ టీమ్ తమ కథతో ముందుకు వెళ్లినట్లు తెలిపారు. అందుకే రెండు ‘దృశ్యం 3’ సినిమాల్లో కథ, క్లైమాక్స్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది.
రెండు రోజుల్లోనే రూ.177 కోట్ల గ్రాస్..
ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ‘దృశ్యం 3’కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఫెమస్ ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk గణాంకాల ప్రకారం.. తొలి రోజు భారత్‌లో రూ.66.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.53.50 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్ రూ.115.50 కోట్లకు చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే సుమారు రూ.177.10 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకెళ్తోంది.
అంతేకాకుండా తొలి రోజే అజయ్ దేవగన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచిన ‘దృశ్యం 3’.. ఆదివారం కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ.150 కోట్ల నెట్ వసూళ్లను బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
‘దృశ్యం 3’ రేంజ్..
2015లో వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే మూడో భాగం కేవలం రెండు రోజుల్లోనే పార్ట్ 1 లైఫ్‌టైమ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్‌ను దాటేసింది. ఇక 2022లో వచ్చిన ‘దృశ్యం 2’ మాత్రం ఫ్రాంచైజ్‌కు మరింత పెద్ద విజయాన్ని అందించింది.
The aakhri hissa on the biggest screen 🙌
— Ajay Devgn (@ajaydevgn) October 1, 2026
Will Vijay Salgaonkar manage to save his family?
Book your tickets now: https://t.co/ocl9LGeRyi#DrishyamTheConclusion in cinemas TOMORROW.#DrishyamDay #2ndOct#Tabu #ShriyaSaran #RajatKapoor #JaideepAhlawat @prakashraaj… pic.twitter.com/ZLfIrSVMFj
ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.342 కోట్ల గ్రాస్ సాధించింది. భారత్‌లో తొలి రోజు దాదాపు రూ.15.38 కోట్లతో ప్రారంభమైన ఆ సినిమా.. చివరకు భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘దృశ్యం 3’ కేవలం రెండు రోజుల్లోనే రూ.177 కోట్ల మార్క్‌ను అందుకోవడంతో.. పార్ట్ 2 లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను కూడా అందుకుంటుందా? లేదా? అనే ఆసక్తి మొదలైంది.
రూ.342 కోట్ల టార్గెట్ వైపు అడుగులు?
‘దృశ్యం 3’ ప్రస్తుతం దూసుకెళ్తున్న వసూళ్లను చూస్తే.. ఓపెనింగ్ వీకెండ్‌లోనే భారీ నంబర్లను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ డే రూ.53.50 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు రావడం కూడా ‘దృశ్యం 3’ కు ఉన్న డిమాండ్‌ను చూపిస్తోంది. అయితే ‘దృశ్యం 2’ చేసిన రూ.342 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను అందుకోవాలంటే సినిమా రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగించాలి. ప్రస్తుతం మాత్రం పరిస్థితులు సినిమాకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో మూడో రోజు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
‘దృశ్యం’కు కొత్త ముగింపు..
మొత్తంగా చూస్తే.. ‘దృశ్యం 3’ ఇప్పుడు కేవలం మరో సీక్వెల్‌గా కాకుండా.. ఒకే ఫ్రాంచైజ్‌లో రెండు భిన్నమైన కథా ప్రపంచాల మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోటీగా మారింది. ఒకవైపు మోహన్‌లాల్ నటించిన మలయాళ ‘దృశ్యం 3’పై అభిమానుల ప్రేమ కొనసాగుతుంటే.. మరోవైపు అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ కొత్త కథ, కొత్త క్లైమాక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మలయాళ ప్రేక్షకుల్లోని కొందరు “హిందీ వెర్షన్ 100 రెట్లు బెటర్” అంటూ ప్రశంసించడం.. అదే సమయంలో రెండు రోజుల్లోనే రూ.115.50 కోట్ల ఇండియా నెట్, రూ.177 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించడం.. ఈ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది.
