మెున్నటికి మెున్న యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితం అనే చట్టాన్ని తొలగించింది మోడీ సర్కార్. రానున్న కాలంలో పెద్ద వ్యాపారులపై యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వసూలు చేసేందుకు ఈ ప్లాన్ చేయగా.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం బయటకు వచ్చేసింది. అసలు యూపీఐ వ్యవస్థను రన్ చేసేందుకు కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, క్యాష్ సపోర్ట్ మెల్లమెల్లగా ఎత్తేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్లాన్ చేస్తోందని వెల్లడైంది. ఇదే జరిగితే యూపీఐ పేమెంట్స్ భవిష్యత్తులో ప్రజలకు భారంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు ఊపునిచ్చిన యూపీఐకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక మద్దతును రానున్న సంవత్సరాల్లో క్రమంగా తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. యూపీఐ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధిగా మార్చేందుకు కేంద్రం రెండు మార్గాలను పరిశీలిస్తోంది.
మళ్లీ MDR తెరపైకి..
కొన్ని అధిక విలువైన లావాదేవీలు, నిర్దిష్ట కేటగిరీ కిందకు వచ్చే వ్యాపారులపై మళ్లీ మర్చంట్ ఛార్జీలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. 2019 డిసెంబర్ వరకు యూపీఐ పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలపై గరిష్ఠంగా 0.30 శాతం MDR ఉండేది. 2020 జనవరి నుంచి డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచేందుకు దాన్ని సున్నా చేశాక ప్రజలు వ్యాపారులు యూపీఐ పేమెంట్స్ వాడటానికి అలవాటు పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అసలు సమస్య ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారమే. FY27లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ విలువైన ప్రజలు వ్యాపారుల మధ్య జరిగే బీమ్ యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించింది. కానీ ఇండస్ట్రీ అంచనా వ్యయం ఏకంగా రూ.20వేల700 కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులకూ వాస్తవ ఖర్చులకు భారీ అంతరం ఉంది. అందుకే కంపెనీలు కూడా ఈ భారాన్ని మోయలేకపోతున్నాయి. అందుకే అధిక విలువైన మర్చంట్ లావాదేవీలకు మాత్రమే MDR ఆధారిత ఆదాయ మోడల్ తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. చిన్న వ్యాపారులు, వ్యక్తి-వ్యక్తి చెల్లింపులపై భారం పడకుండా చూడాలని స్పష్టం చేసింది.
మెల్లగా భారం తగ్గించుకునే వ్యూహం
మొత్తానికి యూపీఐని ఒక్కసారిగా మార్చకుండా.. దశలవారీగా ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, మార్కెట్ ఆధారిత ఆదాయ వ్యవస్థ వైపు తీసుకెళ్లాలన్నది మోడీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే MDR ఎప్పటి నుంచి, ఎంత శాతం, ఎవరిపై విధిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. భవిష్యత్తులో యూపీఐ వ్యవస్థ నడిపించేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం కాకుండా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలోని బిజినెస్ లావాదేవీలే మోసేలా చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. సో అవి అటుతిరిగి ఇటు తిరిగి చివరికి అంతిమంగా ప్రజల జేబులకే చిల్లుపెట్టడం గ్యారెంటీ అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వ్యాపారులు ఈ పేమెంట్ ఖర్చులు కూడా తమ కస్టమర్లకే పెంచిన వస్తుసేవల రేట్ల రూపంలో పాసాన్ చేస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. అంటే 5 ఏళ్ల తర్వాత యూపీఐ ఫ్రీ పేరుకే కానీ భారం జనంపైనే అన్నమాట.
