సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. తనపై వస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా స్పందించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై వస్తున్న ఊహాగానాలు, విమర్శలపై పోచారం తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రిని కలవడంలో ఒక్క శాతం కూడా స్వార్థం లేదని, తాను ఎవరికో డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదని తేల్చిచెప్పారు.
అన్నం పెట్టిన వాడికి సున్నం పెడతారా? అంటూ కొందరు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను స్వార్థం కోసం ఎప్పుడూ పని చేయలేదని, దమ్ముంటే తాను ఎక్కడైనా స్వార్థంతో పని చేసినట్లు ఒక్క పని నిరూపించాలని సవాల్ విసిరారు. బీర్కూర్‌లో తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి రహస్యం లేదని, ప్రజల కోసం తాను ఎవరితోనైనా పోరాడి హక్కులు సాధించుకుంటానని తేల్చిచెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పనిచేశానని ఆయన స్పష్టం చేశారు.
తాను ఎవరి ముందూ తలదించుకుని పనిచేసే రాజకీయ నాయకుడిని కానని, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితమని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పోచారం చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
