తుమ్మిడిహట్టికి త్వరగా అనుమతులు ఇప్పించండి: కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్

తుమ్మిడిహట్టికి త్వరగా అనుమతులు ఇప్పించండి: కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వర‌గా అనుమ‌తులు ఇప్పించాల‌ని కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‎కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే స‌మ‌ర్పించామ‌ని కేంద్ర మంత్రికి తెలిపారు.

మంగళవారం (సెప్టెంబర్ 29) సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో జ‌ల్‌ శ‌క్తి మంత్రి పాటిల్‌‎తో సమావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టుల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్‌ఆర్‌ఎల్‌ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంప‌ల్లికి త‌ర‌లించేందుకు వీలుంటుంద‌ని వివరించారు. దాంతో నీటి తరలింపున‌కు అవసరమయ్యే విద్యుత్తు వినియోగం, విద్యుత్తు వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), డిండి ఎత్తిపోతల పథకం (DLIS), సీతారామ సాగర్ బ‌హుళార్ధక ప్రాజెక్టు (SSMP), గౌరవెల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పర్యావరణ అనుమతులకు మార్గదర్శకాలను జారీ చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయా ప్రాజెక్టుల‌కు వెంట‌నే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాల‌ని కోరారు. అనుమ‌తుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్య‌యం పెరుగుతోంద‌ని తెలిపారు. 

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడ‌బ్ల్యూసీకి స‌మ‌ర్పించామ‌ని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాల‌ని కోరారు. ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు తాము చర్చిస్తున్నామ‌ని తెలిపారు.

►ALSO READ | రైతుల కోసం పదేళ్లలో ఏం చేశావ్ ? కేటీఆర్ విమర్శలకు ఎంపీ వంశీకృష్ణ కౌంటర్

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాల‌ను త్వర‌గా ఏర్పాటు చేయాల‌ని పాటిల్‌‎ని ముఖ్యమంత్రి కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ. 4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు రెండు, మూడో దశలకు సంబంధించిన యంత్రాల‌ను త్వరగా ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో మంత్రి జి. వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్‌, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు (నీటిపారుద‌ల‌) ఆదిత్యనాధ్ దాస్‌, సీఎం సెక్రట‌రీ మాణిక్‌రాజ్‎తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.