SS Rajamouli: రెక్కలు చాచి.. మంటలు చిమ్మే ‘డ్రాగన్’ అంటూ.. ఎన్టీఆర్ సినిమాపై జక్కన్న భారీ హైప్

SS Rajamouli: రెక్కలు చాచి.. మంటలు చిమ్మే ‘డ్రాగన్’ అంటూ.. ఎన్టీఆర్ సినిమాపై జక్కన్న భారీ హైప్

వారణాసి షూటింగ్‌తో బిజీగా ఉన్న దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చాలా రోజుల తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్‌లో సందడి చేశారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన జక్కన్న.. తనదైన శైలిలో మాట్లాడి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రాజమౌళి తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, హీరో ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ యేలేటి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ తన ‘డ్రాగన్’ సినిమా గురించి చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ.. రెండు రెక్కలు చాచి, గోర్లు ముందుకు పెట్టి, నోటి నుంచి మంటలు చిమ్మే డ్రాగన్ కోసం తాను కూడా అభిమానుల్లాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

ఫహాద్ ఫాజిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘మీ లాంటి నటుడిని చాలా తొందరగా గుర్తించలేకపోయాను. ఫహాద్‌కు నేను బిగ్ ఫ్యాన్‌ను’’ అని రాజమౌళి అన్నారు. పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రత్యేకతను చూపించే ఫహాద్.. ఈ సినిమాలో ప్రేక్షకులను మరో కొత్త కోణంలో అలరించబోతున్నారని చెప్పడం ద్వారా సినిమాపై ఆసక్తిని పెంచారు.

దర్శకుడు శశాంక్ యేలేటి గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఒకరోజు తనకు ఫోన్ చేసి కథ చెబుతానని చెప్పాడన్నారు. ‘‘నువ్వు చెప్పే స్టోరీ జస్ట్ ఐదు నిమిషాల్లో చెప్పాలి.. లేదంటే కథ వినను’’ అని తాను షరతు పెట్టినట్లు తెలిపారు. దానికి శశాంక్.. ‘‘దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ’’ అని చెప్పడంతో వెంటనే షాక్ అయ్యానని రాజమౌళి వెల్లడించారు. ఆ తర్వాత దాదాపు మూడు గంటల పాటు కథ విన్నానని, కథ నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పానని చెప్పారు.

►ALSO READ | Jr NTR Emotional: ‘మా అమ్మకు మరో కొడుకు పుట్టి ఉంటే అతనే కార్తికేయ’.. జక్కన్న కొడుకుపై ఎన్టీఆర్ ఎమోషనల్!

సినిమా చూసిన అనుభవాన్ని కూడా రాజమౌళి పంచుకున్నారు. ‘‘ఈ సినిమా చూస్తూ చాలాసేపు నవ్వాను.. ఏడ్చాను. చాలా హార్ట్ టచింగ్ ఫిలిం’’ అని ప్రశంసించారు. చిన్నారి సారా నటనను ప్రత్యేకంగా ప్రస్తావించిన రాజమౌళి.. ఫహాద్ ఫాజిల్‌ను కూడా డామినేట్ చేసేంత అద్భుతంగా ఆమె నటించిందని కొనియాడారు.

ఇక తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ గురించి మాట్లాడుతూ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజినెస్ విషయంలో కార్తికేయ ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తూ.. ‘‘కార్తికేయకు ఒక రూపాయి రావాలని ఎంత ఆసక్తిగా బిజినెస్ చేస్తాడో.. అవతలి వ్యక్తికి కూడా అదే రూపాయి లాభం రావాలని ఆలోచిస్తాడు. అంత మంచి, అద్భుతమైన ఆలోచన ఉంది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నా’’ అని అన్నారు.

రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌కు శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి స్పీచ్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.