- కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు నీటి పాలు చేసిన్రు
- సీఎం రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలి : ఎంపీ అర్వింద్
బోధన్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లను నీటి పాలు చేసిన కేసీఆర్ తెలంగాణకు నంబర్ 1 విలన్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆదివారం చేపట్టిన సైకిల్ యాత్రను ఎంపీ అర్వింద్ ప్రారంభించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఓ చోట పర్మిషన్ తీసుకొని మరో చోట నిర్మించడంతో పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై నాసిరకం పనులు చేపట్టి, లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పథకాన్ని ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాయన్నారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టే సైకిల్ యాత్ర బోధన్ నుంచి జగిత్యాల వరకు 300 గ్రామాలను కలుపుతూ.. మూడు రోజుల పాటు 180 కిలో మీటర్ల మేర కొనసాగుతుందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ పోరాటం ఆపేది లేదన్నారు. సైకిల్ యాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, బీజేపీ కార్యనిర్వహక సభ్యులు మోహన్ రెడ్డి, బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ పాల్గొన్నారు.
