బంగ్లాదేశ్ మొత్తం చీకటి మయం..కరెంట్ లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు రాత్రి 8 గంటలకే మూసేయాలని ప్రభుత్వం ఆర్డర్ వేసింది. తీవ్రమైన విద్యుత్ కొరత తో వ్యాపారులు, రైతులు, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక మా దేశంలో కరెంట్ సమస్య తీర్చండి మహా ప్రభో అంటూ బంగ్లాదేశ్ పాలకులు భారత్ ను ఆశ్రయించారు.
బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు విధించడంతో ప్రజలు, వ్యాపారులు, రైతులు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాత్రి 8 గంటలకే మాల్స్, మార్కెట్లు, షాపులు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో రోజుకు 3 నుంచి 10 గంటల వరకు విద్యుత్ కోతలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18 వేల మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం 13 వేల మెగావాట్ల వరకు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఖుల్నా, మైమెన్‌సింగ్, బరిశాల్, రంగపూర్, సిల్హెట్, రాజ్‌షాహి ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది.
గ్యాస్ కొరతే ప్రధాన కారణం
బంగ్లాదేశ్ విద్యుత్ ఉత్పత్తికి సహజ వాయువుపై ఎక్కువగా ఆధారపడుతోంది. విద్యుత్ రంగానికి రోజుకు 1 బిలియన్ క్యూబిక్ అడుగులకు పైగా గ్యాస్ అవసరం కాగా.. ప్రస్తుతం 700 మిలియన్ క్యూబిక్ అడుగులే అందుతోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయి లోడ్ షెడ్డింగ్ పెరిగింది.
ఇటీవల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం జరగడం, సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొన్ని ఎల్‌ఎన్‌జీ నౌకలు సరుకును దించలేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేశాయి. దిగుమతి చేసుకునే విద్యుత్ సరఫరా తగ్గడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తిందంటున్నారు అక్కడి అధికారులు.
రైతులు, పరిశ్రమలపై ప్రభావం
కరెంట్ కోతలతో పరిశ్రమలు, వస్త్ర రంగం, రెస్టారెంట్లు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రైతులు నీటిపారుదల కోసం డీజిల్ జనరేటర్లను ఉపయోగించాల్సి వస్తోంది. రొయ్యల పెంపకందారులు కూడా భారీగా నష్టపోతున్నారు. ఎరేటర్లు పనిచేయకపోవడంతో నీటిలో ఆక్సిజన్ తగ్గి రొయ్యలు చనిపోతున్నాయి.
ALSO READ : విద్యుత్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
భారత్ కు బంగ్లాదేశ్ విజ్ణప్తి..
విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు బంగ్లాదేశ్ భారత్‌ను అదనపు డీజిల్ సరఫరా చేయాలని కోరింది. భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా ఇప్పటికే డీజిల్ సరఫరా జరుగుతోంది. మరింత డీజిల్ అందించాలని బంగ్లాదేశ్ కోరింది.
ప్రస్తుతం భారత్ నుంచి లభించే అదనపు డీజిల్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు. అయితే ఇంధనం, గ్యాస్ కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటమే బంగ్లాదేశ్‌కు ప్రధాన సమస్యగా మారింది.
