కేపీహెచ్‌బీలో చిట్టీల పేరుతో రూ.16 కోట్లు కుచ్చుటోపీ!

కేపీహెచ్‌బీలో చిట్టీల పేరుతో  రూ.16 కోట్లు కుచ్చుటోపీ!

హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్టీల మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిట్టీల నిర్వహణ పేరుతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, గడువు ముగిసినప్పటికీ నగదు తిరిగి చెల్లించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.16 కోట్ల మేర మోసం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

బాధితుల వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిధిలో కొంతకాలంగా చిట్టీల నిర్వహణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులపై నమ్మకంతో పలువురు నెలనెలా చిట్టీల్లో డబ్బులు జమ చేసినట్లు చెబుతున్నారు. చిట్టీ కాలపరిమితి పూర్తయిన తర్వాత తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.   అయితే చిట్టీల గడువు పూర్తయినప్పటికీ డబ్బులు చెల్లించకుండా నిర్వాహకులు తప్పించుకోవడం ప్రారంభించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో పలువురు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో మొత్తం రూ.16 కోట్ల మేర ఆర్థిక మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. బాధితుల సంఖ్య, ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన మొత్తం, చిట్టీల నిర్వహణ జరిగిన కాలం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.చిట్టీల్లో డబ్బులు పెట్టిన పలువురు ప్రస్తుతం తమ నగదు తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. తమ జీవితకాల పొదుపులు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను చిట్టీల్లో పెట్టామని, ఇప్పుడు ఆ మొత్తాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు.

బాధితుల ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై గచ్చిబౌలి EOW (Economic Offences Wing) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చిట్టీల పేరుతో డబ్బులు ఎలా సేకరించారు? ఎంతమంది నుంచి నగదు తీసుకున్నారు? మొత్తం ఎంత మేర లావాదేవీలు జరిగాయి? బాధితులకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? అనే అంశాలపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.