విద్యుత్ సరఫరా లేదా ప్రమాదాల కేసుల్లో ఎలక్ట్రిసిటీ బోర్డులు, అధికారులపై సంపూర్ణంగా బాధ్యత మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవి ఖచ్చితమైన బాధ్యత (స్ట్రిక్ట్ లయబిలిటీ) కిందకు వస్తాయని, కొన్ని మినహాయింపులు మినహా బాధ్యులైన సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.
జస్టిస్ సంజయ్ కారోల్, జస్టిస్ నొంగ్మైకాపమ్ కొటేశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ పై హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్‌లు సంపూర్ణ బాధ్యతను మోపుతూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కనపెట్టింది.
ఈ తీర్పు రెండు వేర్వేరు విద్యుత్ ప్రమాదాలకు సంబంధించింది. 11 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఘటనలో క్రికెట్ బాల్‌ను తీసుకెళ్లే ప్రయత్నంలో 66 కేవీ లైన్ బారినపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుల విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
విద్యుత్ ప్రసారం అంతర్గతంగా ప్రమాదకరమైన కార్యకలాపమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి ప్రమాదకర పనులు నిర్వహించే సంస్థలు నష్టాన్ని భరించాలని, ఎలాంటి తప్పిదం లేకపోయినా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే స్ట్రిక్ట్ లయబిలిటీ నియమానికి వర్తించే మినహాయింపులు ఈ కేసులో వర్తిస్తాయా లేదా అనేది చూడాలని తెలిపింది.
