ఓటరు జాబితాలో తన పేరు తొలగింపు వ్యవహారంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లేటెస్ట్ గా కొత్త ఓటరు కార్డు కోసం తాను మళ్లీ ఫారమ్ 6 దరఖాస్తు చేసుకోవల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఓటు హక్కు లభించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అయితే దాని కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలు క్యూలైన్లలో నిలబడి భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏంటని నిలదీశారు.
ప్రతి పౌరుడి హక్కు..
నా వృత్తి కారణంగా నేను సెలబ్రిటీ అయి ఉండొచ్చు. కానీ అంతకంటే ముందు నేను ఒక పౌరుడిని. దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న హక్కులే నాకు కూడా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి గురించి కాదు.. పౌరుల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. తాను ఈ అంశాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించిన కొద్దిగంటల్లోనే అది లక్షలాది మందికి చేరిందని తెలిపారు. ఇది కేవలం ప్రకాశ్‌రాజ్ సమస్య కాదు.. ప్రతి పౌరుడి హక్కుకు సంబంధించిన ప్రశ్న అంటూ గళమెత్తారు.
ఓటు కోసం ఎందుకు వేడుకోవాలి?
ఓటు హక్కు కోసం ప్రజలు క్యూల్లో నిలబడి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 'ఇదేం రాజకీయం? ఇదేం ఎజెండా?'అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. తనకు అధికారులు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, సమస్యను సరిదిద్దుతామని చెప్పారని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డులు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, వెబ్‌సైట్‌లోని వివరాలను మార్చారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తన పాత చిరునామాకు బీఎల్‌వోను పంపించి, పొరుగువారిని విచారిస్తూ నాటకీయ పరిణామాలకు తెరతీశారని విమర్శించారు.
ఈసీ, బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్..
అయితే ఈ ఆరోపణలపై కర్ణాటక బీజేపీ భిన్నమైన వాదనను వినిపించింది. అధికారుల పరిశీలన ప్రకారం ప్రకాశ్‌రాజ్ పాత చిరునామాలో నివసించడం లేదని, అందుకే ఆయన ఓటరు నమోదును షిప్ట్ గా గుర్తించినట్లు పేర్కొంది. కొత్త చిరునామాలో నమోదు కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. అటు ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటు సమాధానం ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఓటును ఎలాంటి ఏకపక్ష నిర్ణయంతో తొలగించలేదన్నారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR)లో భాగంగా నిబంధనల ప్రకారమే చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు
ప్రస్తుతం ఈ వివాదం ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఎన్నికల అధికారులు అన్న విధంగా మారిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వివాదంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రకాశ్ రాజ్ ఆరోపణల్లో నిజం ఎంత? ఎన్నికల అధికారుల వివరణలో ఎంత వాస్తవం ఉంది? అన్నదానిపై నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Fraand … You can’t abuse the DIGNITY of a CITIZEN #justasking pic.twitter.com/GyUvheAHO5
— Prakash Raj (@prakashraaj) August 13, 2026
