స్వర్ణగిరి ఆలయానికి లీగల్ నోటీసులు..యాదగిరిగుట్టకు సంబంధించిన ‘వైటీడీ’ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించిన నిర్వాహకులు

స్వర్ణగిరి ఆలయానికి లీగల్ నోటీసులు..యాదగిరిగుట్టకు సంబంధించిన ‘వైటీడీ’ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించిన నిర్వాహకులు
  • నోటీసులు పంపించిన యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా, భక్తులను అయోమయానికి గురిచేసేలా వెబ్ సైట్ సృష్టించిన భువనగిరి శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు లీగల్ నోటీసులు పంపించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం 'వైటీడీ' (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్) పేరుతో అధికారిక గెజిట్ ను విడుదల చేసింది.

 ఈ గెజిట్ ప్రకారం 'వైటీడీ' బ్రాండ్ ను మరెవరూ ఉపయోగించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ, స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా 'వైటీడీ' పేరుతో www.ytdtemple.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. 

స్వర్ణగిరి ఆలయానికి ఇప్పటికే  www.swarnagiritemple.com అనే అధికారిక వెబ్ సైట్ అందుబాటులో ఉంది. దీని ద్వారానే పూజ, సేవల వివరాలు, ఆన్ లైన్ సేవలను అందిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల ytdtemple.com అనే పేరుతో మరో వెబ్ సైట్ ను సృష్టించడమే కాకుండా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పోలిన ఫొటోలను అప్ లోడ్ చేశారు. ఈ వ్యవహారం యాదగిరిగుట్ట దేవస్థాన అధికారుల దృష్టికి వెళ్లింది. 

దీంతో ప్రభుత్వ గెజిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను స్వర్ణగిరి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా రూపొందించిన ytdtemple.com వెబ్ సైట్ ను నిలిపివేయాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

యాదగిరిగుట్ట అఫీషియల్ వెబ్ సైట్ ను పోలి ఉండేలా చలామణిలో ఉన్న మరికొన్ని వెబ్ సైట్లు, పోర్టల్ నిర్వాహకులకు సైతం నోటీసులు జారీ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. యాదగిరిగుట్ట దేవస్థానానికి అధికారిక వెబ్ సైట్ https://yadagiriguttatemple.telangana.gov.in మాత్రమే ఉందని, దీని ద్వారానే భక్తులు యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించిన ఆన్ లైన్ సేవలు పొందాలని సూచించారు.