- ఈనెల 8న మధ్యాహ్నం 2 గంటల వరకే గడువు ఇచ్చిన కాళోజీ యూనివర్సిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులకు వర్సిటీ ఫ్రీ ఎగ్జిట్కు చాన్స్ఇచ్చింది. 2026–-27 విద్యాసంవత్సరానికి కన్వీనర్(కాంపిటెంట్ అథారిటీ) కోటా కింద రెండో విడత వరకు ఎంబీబీఎస్ సీట్లు పొందిన వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది.
సీటు వదులుకోవాలనుకునే స్టూడెంట్స్సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ కు దరఖాస్తు చేసుకుని, ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలాంటి జరిమానా లేకుండా తప్పుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే, ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా కింద జరిగే తదుపరి విడతల కౌన్సెలింగ్ కు పూర్తిగా అనర్హులవుతారని, గడువు ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకుంటే నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
మరోవైపు, ఫ్రీ ఎగ్జిట్ ఎంచుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు వారు చెల్లించిన పూర్తి ఫీజును వెంటనే తిరిగి ఇచ్చేయాలని, ఆ వివరాలను అక్టోబర్ 8 మధ్యాహ్నం 2.30 గంటల్లోపు తప్పనిసరిగా అడ్మిషన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను వర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశించారు.
