‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ సినిమా రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. చివరి దశ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో అనుకున్న తేదీకి సినిమాను తీసుకురావడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చినప్పటికీ.. సినిమా వరుస పర్వంతో నడుస్తుండటంతో వెంకీ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.
2-3 వారాల్లో పెండింగ్ పనులకు ఫుల్‌స్టాప్: నాగవంశీ
సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణతో పాటు కొంత షూటింగ్ పార్ట్ పూర్తి చేయాల్సి ఉందని నాగవంశీ వెల్లడించారు. వీటితో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో ఈ పనులన్నింటినీ కంప్లీట్ చేసి, ఆ తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
చివరి నిమిషంలో ఎందుకు ఆపాల్సి వచ్చింది?
సినిమా విడుదలకు కేవలం నాలుగైదు రోజుల ముందు రిలీజ్‌ను నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని నిర్మాత పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరి నిర్ణయంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అనుకున్న తేదీకే సినిమాను విడుదల చేస్తే టీమ్ కూడా ప్రేక్షకులతో పాటు థియేటర్‌లోనే ఫైనల్ కాపీని చూడాల్సిన పరిస్థితి వస్తుందని నాగవంశీ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
క్వాలిటీ విషయంలో తొందరపడకూడదనే నిర్ణయం
మిగిలిన షూటింగ్, పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పనులు పూర్తయ్యాకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం రిలీజ్ డేట్‌ను అందుకోవడం కోసం హడావుడి చేయకుండా.. పూర్తిస్థాయి ఔట్‌పుట్‌తో సినిమాను తీసుకురావడమే మంచిదని టీమ్ భావిస్తోంది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’కు కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. పెండింగ్ పనులన్నీ పూర్తయ్యాకే కొత్త డేట్‌ను వెల్లడించనున్నట్లు నాగవంశీ తెలిపారు. దీంతో ఈ వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబో ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 30 డేట్‌పై మేకర్స్ మొగ్గుచూపుతున్నటుగా టాక్.
