న్యూఢిల్లీ: భారత్, యూఎస్ మధ్య జరుగుతున్న మధ్యంతర వాణిజ్య ఒప్పంద చర్చలు ఒక కొలిక్కి రాకుండా స్తంభించిపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేక తదుపరి పురోగతి కష్టంగా మారిందని పేర్కొన్నారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆమె, అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడాన్ని పరోక్షంగా విమర్శించారు.
వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి చర్చలే సరైన మార్గమని, కానీ ప్రస్తుతం సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ యూఎస్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్‌తో భేటీ అయినప్పటికీ తక్షణ పరిష్కారం లభించలేదు. రష్యాచమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే కొత్త చట్టం యూఎస్‌లో రూపుదిద్దుకోవడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల మనదేశం రష్యా దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది.
