లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. యూపీలో మొత్తం 10 రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం బీజేపీ 8 స్థానాలను సునాయాసంగా దక్కించుకోగలదు.
ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్ 5) బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. యూపీ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధరంపాల్ సింగ్‌తో పాటు, సీనియర్ నాయకులు రాధాకాంత్ ఓఝా, గోపీ కృష్ణ పాండే, ప్రకాష్ పాల్‌లను బరిలోకి దింపింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ దళిత ముఖంగా పరిగణించబడుతున్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ సోంకర్‌కు బీజేపీ రాజ్య సభ టికెట్ ఇచ్చింది.
మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ తరపున క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసిన సీనియర్ నాయకుడు రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్‌లకు కూడా రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. సీనియర్ బీజేపీ నాయకుడు, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కుమార్తె శృతి గంగ్వార్‌ను కూడా బీజేపీ రాజ్య సభ ఎన్నికల బరిలోకి దింపింది.
2027 ఆరంభంలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాల ఆధారంగా క్షేత్రస్థాయి, పార్టీ సంస్థాగత నేతలకు రాజ్య సభ ఎన్నికల్లో ఈసారి అధిష్ఠానం అవకాశం కల్పించింది.
ఇద్దరు కేంద్ర మంత్రులకు నో టికెట్
యూపీ రాజ్య సభ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ ఇద్దరు కేంద్ర మంత్రులకు షాకిచ్చింది. రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బన్వారీ లాల్ వర్మలకు టికెట్ ఇవ్వలేదు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం 2026, నవంబర్ 25తో ముగియనుంది.
కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగాలంటే పదవి కాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లో పార్లమెంట్‌లోని ఏదో ఒక సభలో సభ్యులుగా ఉండాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో వీరి విషయంలో కమలం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా వీరిద్దరని పక్కకు పెడతారా..? లేదంటే ఆరు నెలల్లో మరేదైనా రాష్ట్రం నుంచి రాజ్య సభకు పంపుతారా అన్నది చూడాలి.
