దేవరకొండ: దళిత మహిళ పై దాడిని నిరసిస్తూ ధర్నా

దేవరకొండ: దళిత మహిళ పై దాడిని నిరసిస్తూ ధర్నా
  •     మాజీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్

దేవరకొండ(చింతపల్లి), వెలుగు: దళిత మహిళపై దాడిని నిరసిస్తూ ఆదివారం నల్గొండ జిల్లా చింతపల్లి క్రాస్​రోడ్​పై రాస్తారోకో చేపట్టారు. మండలంలోని పీకే మల్లేపల్లి గ్రామపంచాయతీలో వీవోఏగా పని చేస్తున్న గనిపల్లి మాధవిపై ఆర్థికపరమైన ఆరోపణలు రాగా, ఈ నెల 2న గ్రామసభలో ఆమె వివరణ ఇస్తుండగా గ్రామ మాజీ సర్పంచ్  భర్త కొప్పుల అమర్‌‌‌‌నాథ్  గౌడ్  కులం పేరుతో దూషించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని నిరసిస్తూ ఆదివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో చింతపల్లి క్రాస్‌‌‌‌రోడ్‌‌‌‌లో ఆందోళనకు  దిగారు. 

ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో నాగార్జునసాగర్–హైదరాబాద్  హైవేపై భారీగా ట్రాఫిక్  నిలిచిపోయింది. చింతపల్లి ఎస్సై రామ్మూర్తి అక్కడికి చేరుకొని నిందితుడిని త్వరలో పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎమ్మార్పీఎస్  జిల్లా ఇన్​చార్జి కోళ్ల శివ, నాయకులు బకరం శ్రీనివాస్, వస్కుల శ్రీను పాల్గొన్నారు.