పాకిస్థాన్ T20 జట్టు నుంచి బాబర్ ఔట్.. కింగ్ ఈజ్ కమింగ్ అంటూ డెజర్ట్ వైపర్స్ స్పెషల్ ప్రోమో

పాకిస్థాన్ T20 జట్టు నుంచి బాబర్ ఔట్.. కింగ్ ఈజ్ కమింగ్ అంటూ డెజర్ట్ వైపర్స్ స్పెషల్ ప్రోమో

అంతర్జాతీయ లీగ్ టీ20 (ILT20) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ టోర్నమెంట్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) యూఏఈ వేదికగా జరిగే ILT20 టోర్నమెంట్‌లో అడుగు పెట్టబోతున్నాడు. డిఫెండింగ్ లేదా ఇతర ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగేందుకు బాబర్‌ను డెసర్ట్ వైపర్స్ (Desert Vipers) జట్టు కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బేస్ ప్రైస్‌కే అమ్ముడైన బాబర్: 

ILT20 ఐదో సీజన్ వేలంలో బాబర్ ఆజమ్ తన కనీస ధర (Base Price) అయిన 80,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹76 లక్షలు) ధరతో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే వేలంలో ఏ ఒక్క భారతీయ యాజమాన్యంలోని ఫ్రాంచైజీ కూడా బాబర్ కొనుగోలు కోసం ముందుకు రాలేదు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే డెసర్ట్ వైపర్స్ ఫ్రాంచైజీ అతడిని బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. అయితే బాబర్ తో పాటు పాకిస్థాన్‌కు చెందిన నసీమ్ షా, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ తదితరులను కూడా డెసర్ట్ వైపర్స్ బేస్ ప్రైస్ (USD 80,000) కే దక్కించుకోవడం విశేషం. ఈ సైనింగ్స్‌తో ఆ జట్టులో మొత్తం నలుగురు పాకిస్థాన్ ప్లేయర్స్ చేరినట్లయింది. బాబర్ బ్యాటింగ్ పటిష్టత, మిగతా ఆటగాళ్ల అనుభవంతో ఈసారైనా ట్రోఫీ సాధించాలని ఆ టీమ్ భావిస్తోంది.

ది కింగ్ అంటూ స్పెషల్ ప్రోమో.. నెట్టింట ట్రోల్స్: 

బాబర్ ఆజమ్‌ను జట్టులోకి ఆహ్వానిస్తూ డెసర్ట్ వైపర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ప్రోమో వీడియోను షేర్ చేసింది. Babar Azam is ready to strike in Desert Vipers colours for DP World ILT20 Season 5 అంటూ అతడిని 'ది కింగ్' (The King) అని సంబోధించింది. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం బాబర్‌కు కింగ్ అనే బిరుదు ఇవ్వడంపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్ విషయానికి వస్తే.. DP వరల్డ్ ILT20 ఐదో సీజన్ ఈ ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20వ తేదీ, 2026 వరకు వైభవంగా జరగనుంది. మరి ఈ లీగ్‌లో బాబర్ ఆజమ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది చూడాల్సి ఉంది.