రంగనాయక సాగర్ పరివాహక ప్రాంతం పాడి పంటలు, పచ్చని చెట్లతో అలరారుతుంటుంది. అక్కడి దట్టమైన అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి పండ్లు, దుంపలు తింటూ బతుకుతున్నాయి.
పక్కనే వున్న ముస్త్యాల ప్రాంతంలో వర్షాలు కురువక కరువు ఏర్పడింది. అక్కడి అడవిలోని జంతువులకు తిండి సరిగ్గా దొరకడంలేదు. ఒకసారి బక్కచిక్కిన కోతి దారి తప్పి రంగనాయక అడవిలోకి వెళ్లింది. వారంలోనే పుష్టిగా మారి తిరిగొచ్చింది. బొద్దుగా మారిన కోతిని చూసి కోతులన్ని ఆశ్చర్యపోయాయి. దారి తప్పిన తనను రంగనాయక అడవిలోని జంతువులు కొత్త చుట్టంలా బాగా చూసుకున్నాయని అక్కడి విశేషాలను తోటి కోతులకు వివరించి చెప్పింది. తనకు అక్కడి నుంచి తిరిగి రాబుద్ధి కాలేదంది. కోతుల ముచ్చట్లు చాటుగా వింటున్న నక్కకు ఆశ పుట్టింది. 'వారం రోజులుంటేనే కోతి పుష్టిగా మారింది. మరి ఎప్పుడూ అక్కడే జంతువులన్నీ బలంగానే వుంటాయ'ని, ఎలాగైనా అక్కడికి చేరి వాటిని తిని తన ఆకలిని తీర్చుకోవాలనుకుంది.
ఒకరోజు నక్క అడవిలోని పొదల్లో దూరి, ముల్లు గుచ్చుకుని రక్తం వచ్చేలా దొర్లింది. చర్మం చీల్చుకుపోయేలా చెట్ల బెరడులకు రుద్దుకుని.. ముస్త్యాల అడవి నుంచి రంగనాయక ప్రాంతం చేరింది. గాయపడిన నక్కను చూసి, అక్కడి నక్కలు విచారించి జాలి చూపాయి. క్రూర మృగం బారి నుంచి బయటపడి ఇలా దారి తప్పి వచ్చానని వాటితో చెప్పింది ఈ కపట నక్క. అక్కడున్న నక్కలు ఓదార్చి తమ నివాసాలకు తీసుకెళ్లాయి. నక్క బయటకు ఏడుస్తున్నా. మనసులో మాత్రం అక్కడి పక్షులు, జంతువులను చంపి తినడానికి పథకాలు వేస్తోంది.
గాయంతో వచ్చిన నక్కకు తోటి నక్కలు పండ్లు, దుంపలు తెచ్చి ఇచ్చాయి. ఎంతో బాధతో రొప్పుతూ తిన్నది నక్క.
రెండు రోజుల తర్వాత తెల్లవారగానే నిద్ర లేచిన నక్క ముందు గాయాలతో చనిపోయిన రెండు కుందేళ్లు ఉన్నాయి. నక్క ఒక్కసారిగా భయపడింది. తాను వాటిని చంపకున్నా అవి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. అడవిలోని నక్కలు అన్ని వచ్చి చనిపోయిన కుందేళ్లను తినమని ఆ నక్కకు సైగ చేశాయి.
భయంతో ఉన్న నక్క కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఎలాగైతేనేం ఆహారం దొరికిందని కుందేళ్లను తిన్నది. మరుసటి రోజు కూడా తెల్లవారగానే రెండు కుందేళ్లు నక్క ముందు ఉన్నాయి. కాసేపయ్యాక నక్క ఎలాంటి అదురు.. బెదురు లేకుండా వాటిని తిన్నది. కానీ.. మూడో రోజు నక్క లేచేసరికి కుందేళ్లు కనిపించలేదు. నక్కలన్నీ మామూలుగానే తిరుగుతున్నాయి. రెండు రోజులుగా రుచి చూసిన నక్క మెల్లగా అడుగులు వేస్తూ కొద్ది దూరంలో కనిపించిన కుందేళ్లపై దాడి చేయబోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ముస్త్యాల అడవిలోని కోతి ఎదురుపడింది. దాంతో వెంటనే ఆగిపోయింది. ఆగిపోయిన నక్కను చూసి బిగ్గరగా నవ్వింది. నక్కకు ఏమీ అర్ధం కాక అయోమయంలో పడింది.
"ఓయి! నక్కబావ అనారోగ్యంతో చనిపోయిన కుందేళ్లను గాయపరచి, వేటాడి తెచ్చినట్టు నమ్మించి నీ ముందు వేసింది నేనే. మన ముస్త్యాల అడవిలో చెట్లను గీరుకుంటూ నువ్వు గాయం చేసుకోవడం నేను చూశా. అప్పుడే నీ కపట గుణం అర్ధమయ్యింది. అందుకే నీకంటే ముందే ఇక్కడికి వచ్చి అందరితో చెప్పా. కానీ.. నువ్వు తప్పు చేస్తుంటే పట్టుకోవాలనే ఇన్నాళ్లు వేచి చూశాం" అని చెప్పింది కోతి.
ఆ మాటలకు నక్క ఆశ్చర్యపోయింది. మా అడవిలో నిబంధనల ప్రకారం హింసకు తావులేదని, పండ్లు, దుంపలు తిని బతుకుతున్నామని కపట మోసంతో వచ్చిన నీకు తగిన శాస్తి చేస్తామని నక్కల గుంపు ముందుకు కదిలింది. నక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తింది. అయినా వాటికి చిక్కింది. కానీ.. ఆ నక్కలు దాన్ని చంపకుండా చితకబాది తరిమేశాయి. గాయాలతో తిరిగొచ్చిన నక్కకు ముస్త్యాల అడవిలో మిత్రులు ఆకు పసరుతో వైద్యం చేశాయి. మళ్లీ కపట ఆలోచనలు చేయకుండా బుద్ధిగా జీవించసాగింది.
