క్యూర్ పరిధిలో యాడ్స్‌కు కొత్త రూల్స్..ఇక యాప్‌లోనే బుకింగ్.. ఏ యాడ్ కు ఎంత రేటంటే.?

క్యూర్ పరిధిలో యాడ్స్‌కు కొత్త రూల్స్..ఇక యాప్‌లోనే బుకింగ్.. ఏ యాడ్ కు ఎంత రేటంటే.?

హైదరాబాద్: క్యూర్ పరిధిలో తాత్కాలిక, హైపర్‌లోకల్‌ అడ్వర్టైజ్‌మెంట్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని GHMC, CMC, MMC కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనల ఏర్పాటును క్రమబద్ధీకరించడంతో పాటు అనుమతులు, ఫీజులు, జరిమానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు రూపొందించారు.

ప్రతి వార్డులో అధికారులు ప్రకటనలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించనున్నారు. వార్డు స్థాయిలో ప్రత్యేకంగా ప్రకటనల నోడల్ అధికారిని నియమించనున్నారు.ఒక్కో వార్డులో 5 నుంచి 10 తాత్కాలిక ప్రకటనల స్థలాలు, 25 నుంచి 50 హైపర్‌లోకల్‌ యాడ్‌ స్థలాలను గుర్తించనున్నారు. సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆమోదంతో ఈ స్థలాలను తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అనుమతించిన ప్రకటనల స్థలాలను మై క్యూర్ లేదా అడ్వర్టైజ్‌మెంట్‌ యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక మొబైల్‌ నంబర్‌తో ఒకేసారి ఒక స్లాట్‌ను మాత్రమే బుక్ చేసుకునేలా నిబంధనలు రూపొందించారు.బుకింగ్‌ స్లాట్లు 7 రోజుల ముందుగానే అందుబాటులోకి వస్తాయి. అనుమతి పొందిన ప్రతి యాడ్‌పై కుడివైపు కింద భాగంలో క్యూర్ కోడ్, ఎడమవైపు ప్రింటర్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలి.

అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనలను వెంటనే తొలగించనున్నారు. అక్రమ యాడ్స్‌పై మున్సిపల్‌ అధికారులు, పోలీసులు, హైడ్రా కలిసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.చెట్లు, వారసత్వ కట్టడాలు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్లైఓవర్లు, విగ్రహాలపై ఎలాంటి ప్రకటనలకు అనుమతి ఉండదు. అలాగే తప్పుడు సమాచారం లేదా అభ్యంతరకర కంటెంట్‌ ఉన్న ప్రకటనలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయనున్నారు.

తాత్కాలిక ప్రకటనలకు గరిష్టంగా 3 రోజుల పాటు మాత్రమే అనుమతి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత అనుమతిని పొడిగించే అవకాశం ఉండదు. మళ్లీ ప్రకటన ఏర్పాటు చేయాలంటే కొత్తగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.హైపర్‌లోకల్‌ యాడ్స్‌కు గరిష్టంగా 7 రోజుల వరకు అనుమతి ఇవ్వనున్నారు.

తాత్కాలిక ప్రకటనలకు రోజుకు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. హైపర్‌లోకల్‌ యాడ్స్‌కు రోజుకు రూ.100 నుంచి రూ.500 వరకు ఫీజు నిర్ణయించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధించనున్నారు. తాత్కాలిక యాడ్స్‌ విషయంలో రోజుకు రూ.2,000 నుంచి రూ.8,000 వరకు, హైపర్‌లోకల్‌ యాడ్స్‌కు రోజుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.