మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమైన చిత్రం ‘మారెమ్మ’ (Maremma). దీపా బాలు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పల్లెటూరి ఆచారాలు, జంతుబలులు, మూఢనమ్మకాలు, దైవభక్తి వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ‘మారెమ్మ’ ఈ వీకెండ్ స్పెషల్‌గా అక్టోబర్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
కథేంటంటే?
వరంగల్ ప్రాంతంలోని మహిషాపురం గ్రామంలో వరదలు, అంటువ్యాధులు వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో గ్రామస్తులకు మారెమ్మ తల్లి విగ్రహం దొరకడంతో దాన్ని గ్రామదేవతగా భావించి పూజలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఊరి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి.
అదే సమయంలో గ్రామంలోని ఒంటికన్ను పూజారి ఓ ప్రత్యేకమైన దున్నపోతు పుడుతుందని చెబుతాడు. దాన్ని పదేళ్ల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో పెంచి, ఆ తర్వాత అమ్మవారికి బలిగా ఇవ్వాలని సూచిస్తాడు. ఆ బాధ్యత కర్ణి (మాధవ్ భూపతిరాజు)కి అప్పగిస్తారు. ఆ దున్నపోతుకు ‘మారెమ్మ’ అని పేరు పెడతారు.
In the heart of rural Telangana, every belief has a story… and every story has a turning point. 👀 #Maremma premieres from Oct 9 on Aha! https://t.co/f8g8iUF3Yj
— ahavideoin (@ahavideoIN) October 6, 2026
కర్ణి చిన్నప్పటి నుంచి ఆ మూగజీవితో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటాడు. అయితే ఓ దశలో ఆ పవిత్రమైన దున్నపోతు అనూహ్యంగా కనిపించకుండా పోతుంది. దాని తర్వాత ఊరిలో వరుసగా కొన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయి. దీంతో ఎలాగైనా మారెమ్మను వెతికి తీసుకురావాలని కర్ణి నిర్ణయించుకుంటాడు. ఆ శోధనలో కర్ణికి ఎదురైన రక్తసిక్తమైన సవాళ్లు, స్థానిక ముఠాల పగ, ఊరి మూఢనమ్మకాలు ఏంటనేది మిగతా కథ.
