న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. టీవీకే సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవన్న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించిన విజయ్ సర్కార్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.
ప్రభుత్వం తీసుకున్న ఒక సంక్షేమ విధానాన్ని లేదా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మీరెవరని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఒక విషాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఆర్థిక పరిహారంతో పాటు ఉపాధి కల్పిస్తే అందులో తప్పేముందని వ్యాఖ్యానించింది. మృతుల కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2025, సెప్టెంబర్‌లో కరూర్ జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ ప్రచారం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ పిల్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధితులకు ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని.. ఆర్టికల్ 14, 16 ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఈ చర్య వల్ల ఇతరులు కూడా ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే అవకాశం ఉందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టు విజయ్ సర్కార్:
కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడాన్ని విజయ్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం (ఆగస్ట్ 14) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది.
