మరణాన్ని కళ్లారా చూసిన బాలీవుడ్ హీరోయిన్.. క్యాన్సర్‌పై మనీషా కొయిరాలా ఎమోషనల్!

మరణాన్ని కళ్లారా చూసిన బాలీవుడ్ హీరోయిన్.. క్యాన్సర్‌పై మనీషా కొయిరాలా ఎమోషనల్!

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా. 1991లో 'సౌదాగర్' హిందీ చిత్రంలో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం , అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే 2012లో తన జీవితం ఊహించని భయంకరమైన మలుపు తిరిగింది. స్టేజ్ 4 ఓవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు.  అండాశయ క్యాన్సర్ అని తెలిసిన ఆ క్షణం నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

మనీషా ఎమోషనల్..

లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఎమోషనల్ అయింది. తన జీవితంలోనే అత్యంత భయానకమైన రాత్రి గురించి వెల్లడించింది. నేపాల్ లోని నార్విక్ హాస్పిటల్ లో వైద్యులు తనకు క్యాన్సర్ నిర్ధారణ అయిన చేదు వార్త చెప్పినప్పుడు పగటిపూట నిశ్శబ్దంగా ఉన్నా.. ఆ రాత్రి వేళ ఆమెకు ప్రపంచమే అంతమైపోయినంత భయం వేసింది. నేను చనిపోతానేమో అనిపించింది. చుట్టూ అంతా చీకటిగా.. భయంకరంగా అనిపించింది అంటూ మనీషా కన్నీటి జ్ఞాపకాలను పంచుకుంది.

క్యాన్సర్ తో జీవిత పాఠం.. 

అంతే కాదు క్యాన్సర్ తనకు ఓ పెద్ద జీవిత పాఠం నేర్పిందని మనీషా చెప్పుకొచ్చారు.  దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చారు. ఇది ఒక వరంగా భావించాను. అందుకే అవసరం లేని వాటన్నింటినీ పక్కన పట్టేశా అని తెలిపింది. ఫ్యామిలీ, కొద్దిమంది నిజమైన స్నేహితులు, ఆరోగ్యం, ప్రకృతితో గడిపే సమయానికే ప్రాధాన్యత ఇచ్చానని వెల్లడించారు. క్యాన్సర్‌పై పోరాడి గెలిచాక ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్ ప్రార్థనలే..

ఒకప్పుడు రోజుకు 18 గంటల పాటు, ఆదివారాలు కూడా లేకుండా వరుసగా మూడు , నాలుగు సినిమాలతో బిజీగా ఉండేది.  ఆ ఒత్తిడితో నటనపై ఆసక్తి కూడా తగ్గిపోయిందని మనీషా వెల్లడించారు.  కానీ క్యాన్సర్ పోరాట సమయంలో అభిమానులు పంపిన ప్రేమ, ప్రార్థనలే ఆమెకు మళ్లీ ప్రాణం పోశాయి. తన నటన వల్లే ఈ ప్రేమాభిమానాలు దక్కాయని గుర్తించి, నటన విలువను తెలుసుకున్నారు.

న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో శస్త్రచికిత్స, కీమోథెరపీ చేయించుకున్న మ‌నీషా.. 2013 ఏప్రిల్‌లో చివరి క్యాన్సర్‌ను జయించింది. ఆ తర్వాత 'సంజు','లస్ట్ స్టోరీస్', 'హీరామండి' వంటి చిత్రాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు మరణాన్ని చూసిన ఆమె.. ఇప్పుడు ప్రతి క్షణాన్ని జీవితానికి పండుగలా మార్చుకుంది.