అమెరికా చైనా ట్రేడ్ వార్ ఇప్పుడు భారత్‌లోని కీలక పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించింది. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన ‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్: రైజ్, స్కోప్ అండ్ కాస్ట్స్’ నివేదికలో పూణే, గుజరాత్, చెన్నైలను అమెరికాలోని సిన్సినాటి, డేటన్, కొలంబస్ నగరాలతో పోల్చడం కలకలం రేపుతోంది. పంపులు, కంప్రెసర్ల తయారీలో పోటీపడే ఈ ప్రాంతాలను ‘అగ్లీ సిస్టర్ సిటీస్’గా పేర్కొనడం ద్వారా అమెరికా తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేసింది.
అమెరికా కోపానికి అసలు కారణం చైనా ఉత్పత్తులపై ఉన్న భారీ సుంకాలను తప్పించుకునేందుకు వేరే ద్వారా వస్తువులను అమెరికాకు తరలిస్తున్నారనే ఆరోపణ. చైనాలో తయారైన ఉత్పత్తులకు ఇతర దేశాల్లో స్వల్ప ప్రాసెసింగ్, రీప్యాకేజింగ్, డాక్యుమెంట్ల మార్పులు చేసి, వాటిని ఆ దేశాల ఉత్పత్తులుగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారని వైట్‌హౌస్ అనుమానం వ్యక్తం చేసింది. ఇలా జరిగితే చైనా ఉత్పత్తులపై పడే అధిక సుంకం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థను అమెరికా షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్‌వర్క్ గా పేర్కొంది.
ఈ జాబితాలో భారత్‌ను కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, మెక్సికో, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్‌లతో పాటు టియర్-1లో చేర్చింది. అయితే దీనర్థం భారతీయ ఎగుమతిదారులందరినీ అమెరికా టారిఫ్ ఎగవేతదారులుగా ఆరోపించడం కాదు. పూణే, గుజరాత్, చెన్నైలను ప్రస్తావించడం కూడా నిర్దిష్ట కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించాయని చెప్పడం కాదు. అమెరికా వాదన ప్రధానంగా చైనా ఆధారిత ఉత్పత్తులు భారత తయారీ కేంద్రాల ద్వారా అమెరికా మార్కెట్లోకి చేరి, అక్కడి కంపెనీలకు పోటీగా మారుతున్నాయన్నదే.
►ALSO READ | ఇన్‌స్టాగ్రామ్ కొత్త లోగో వచ్చేసింది.. 10 ఏళ్ల తర్వాత లోగో మార్పు.. కొత్త లుక్ చూశారా ?
అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ‘చైనా పార్ట్స్ వాడితే ఉత్పత్తి చైనాదేనా?’ అనేదే. ప్రపంచ తయారీ వ్యవస్థలో ఇది సాధారణం. భారత కంపెనీ చైనా నుంచి మోటార్లు, ఎలక్ట్రానిక్స్, స్టీల్ వంటి భాగాలను దిగుమతి చేసుకుని, వాటితో భారత్‌లో పూర్తిస్థాయి తయారీ నిర్వహించి అమెరికాకు ఎగుమతి చేయవచ్చు. దీనిని అక్రమంగా చూడలేం. కానీ చైనాలో దాదాపు పూర్తయిన ఉత్పత్తిని భారత్‌కు తీసుకువచ్చి, చిన్నచిన్న మార్పులు చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని చూపిస్తే మాత్రం అమెరికా కస్టమ్స్ దృష్టిలో అది పెద్ద సమస్య కావచ్చు.
ఈ వ్యవహారం భవిష్యత్తులో పూణే, గుజరాత్, చెన్నై వంటి భారత పారిశ్రామిక కేంద్రాలకు పెద్ద పరీక్షగా మారనుంది. అమెరికా నివేదికలో ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు సంబంధించిన చైనా ఆధారిత వాణిజ్యంపై వివిధ అంచనాలు ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయని పేర్కొంది. అంటే వాషింగ్టన్ ఇక కేవలం చైనాను మాత్రమే కాకుండా.. చైనా సరఫరా గొలుసులతో అనుసంధానమైన దేశాల తయారీ ప్రక్రియలను కూడా నిశితంగా పరిశీలించబోతోంది. పూణే, గుజరాత్, చెన్నై పేర్లు ఈ కొత్త అమెరికన్ వాణిజ్య నిఘాకు సంకేతంగా నిలుస్తున్నాయి.
