India Vs Uruguay: బ్రెజిల్‌తో జరిగిన హై-ప్రొఫైల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫుట్‌బాల్ అభిమానులకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. గత ఏడాది కోల్‌కతాలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం కారణంగా ఆ స్టార్ ఆటగాడిని చూడలేకపోయిన సుమారు 22,000 మంది అభిమానులకు.. అక్టోబర్ 6వ తేదీన జరగనున్న భారత్ వర్సెస్ ఉరుగ్వే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఉచిత టికెట్లు ఇస్తామని వెల్లడించారు.
మెస్సీ అభిమానులకు ప్రత్యేక ఊరట:
గత ఏడాది కోల్‌కతాలో జరిగిన లియోనల్ మెస్సీ ఈవెంట్ సమయంలో స్టేడియం దగ్గర జరిగిన గందరగోళం కారణంగా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ ఎంతో మంది అభిమానులు అర్జెంటీనా సూపర్ స్టార్‌ను ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురైన ఆ సుమారు 22,000 మంది అభిమానులకు న్యాయం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. మీడియా ద్వారా నేను ఆనాటి మెస్సీ ఈవెంట్‌లో నష్టపోయిన ఆ 22,000 మందికి చెప్పాలనుకుంటున్నూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున ఒక వాట్సాప్ నంబర్‌ను ప్రకటిస్తాం.. దాని ద్వారా వారు ఉరుగ్వే మ్యాచ్‌కు సంబంధించిన ఉచిత టికెట్లను పొందవచ్చని పేర్కొన్నారు.
బ్రెజిల్‌తో మ్యాచ్, సాల్ట్ లేక్ స్టేడియం విశేషాలు:
శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు భారీ స్పందన లభించింది. బ్రెజిల్ తన బలమైన స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగి భారత్‌పై 4–0 తేడాతో గెలిచింది. అయితే 85,000 మంది సామర్థ్యం గల సాల్ట్ లేక్ స్టేడియంలో కొన్ని గ్యాలరీలు ఖాళీగా కనిపించడంపై సీఎం సువేందు స్పందిస్తూ.. జనసమ్మర్ధాన్ని నియంత్రించడానికి, మెరుగైన భద్రతా ఏర్పాట్ల కోసం సుమారు 20,000 సీట్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించలేదని సీఎం వెల్లడించారు.
►ALSO READ | హిట్‌మ్యాన్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ.. ఇంతలోనే జారిపడిన రోహిత్ ఫోన్.. వీడియో వైరల్!
ఉరుగ్వేతో తదుపరి పోరుకు సిద్ధమైన భారత్:
ఖలీద్ జమీల్ శిక్షణలోని భారత జట్టు, రాబోయే అక్టోబర్ 6వ తేదీన మరోసారి సాల్ట్ లేక్ స్టేడియంలో అడుగు పెట్టనుంది. రెండుసార్లు ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఉరుగ్వేతో భారత్ తలపడనుంది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లోని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, మరోసారి అగ్రశ్రేణి సౌత్ అమెరికన్ జట్టుతో తలపడేందుకు బ్లూ టైగర్స్ సిద్ధమవుతున్నాయి.
