జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయింది. జిల్లాలోని వెల్గటూర్ మండలంలోని జగదేవుపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగదేవుపేట గ్రామానికి చెందిన రైతు మాధవరెడ్డి 16 గుంటల భూమిలో వరి సాగు చేస్తున్నాడు. శనివారం ( అక్టోబర్ 4 ) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి గడ్డి మందు కొట్టడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది.
నోటికాడికి వచ్చిన పంట కళ్లముందే ఎండిపోవడంతో రైతు మాధవరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటనతో సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట ఏపుగా పెరిగి చేతికొచ్చే దశకు చేరుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ పొలంలోకి చొరబడి గడ్డి మందు పిచికారీ చేసినట్లు తెలిపాడు బాధితుడు.
పొలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా, రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి గడ్డి మందు పిచికారీ చేస్తున్న దృశ్యాలు రికార్డు అయినట్లు రైతు వెల్లడించాడు. ఈ ఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. మాధవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
