జమ్‌షెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ 100 రూపాయలేనా: ఇంత తక్కువకు టాటా అమ్మటం ఏంటీ..?

జమ్‌షెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ 100 రూపాయలేనా: ఇంత తక్కువకు టాటా అమ్మటం ఏంటీ..?

Jamshedpur FC: కోట్ల రూపాయల విలువైన ఒక ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్‌బాల్ క్లబ్‌ను కేవలం వంద రూపాయలకే (₹100) అమ్మేశారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ టాటా స్టీల్, జమ్‌షెడ్‌పూర్ ఫుట్‌బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (JFSPL) విషయంలో ఇదే జరిగింది. గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు రూ. 100 కే క్లబ్‌ను విక్రయించడం ఇప్పుడు క్రీడా, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంత తక్కువ ధరకు టాటా లాంటి దిగ్గజ సంస్థ అమ్మేయడం ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కార్పొరేట్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రూ.100 డీల్.. ఐఎస్‌ఎల్ లైసెన్స్ సొంతం: 
కేవలం వంద రూపాయలకే (₹100) ఒప్పందం చేసుకోవడంతో జమ్‌షెడ్‌పూర్ ఎఫ్‌సీకి ఉన్న ఇండియన్ సూపర్ లీగ్ (ISL) స్పోర్టింగ్ లైసెన్స్ మొత్తం చర్చిల్ బ్రదర్స్ హస్తగతం కానుంది. దశాబ్దాలుగా జమ్‌షెడ్‌పూర్‌లో ఫుట్‌బాల్ క్రీడను ప్రోత్సహిస్తూ, ఐఎస్‌ఎల్‌లో జమ్‌షెడ్‌పూర్ FCని ఒక శక్తివంతమైన జట్టుగా తీర్చిదిద్దిన టాటా స్టీల్ ఈ నిర్ణయంతో యాజమాన్య హక్కుల నుంచి తప్పుకోవడమే కాకుండా, జట్టు యాజమాన్య బాధ్యతల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.

సెప్టెంబర్ 2026 నుంచి కొత్త బాధ్యతలు: 
ఈ విక్రయ ప్రక్రియలో భాగంగా జమ్‌షెడ్‌పూర్ ఎఫ్‌సీకి సంబంధించిన సర్వహక్కులు, బాధ్యతలు చర్చిల్ బ్రదర్స్ అధీనంలోకి వెళ్లనున్నాయి. సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ క్లబ్ ఈ ఫుట్‌బాల్ ఆపరేషన్ల బాధ్యతలను అధికారికంగా స్వీకరించనుంది. ఈ క్లబ్‌లోని 12 మంది కీలక ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌ల కాంట్రాక్టులను కూడా చర్చిల్ బ్రదర్స్ కొనసాగించేందుకు అంగీకరించింది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) అనుమతి, ఇతర చట్టబద్ధమైన నిబంధనలు పూర్తయిన తర్వాత ఈ విక్రయ ప్రక్రియ పూర్తి కానుంది. 

ఐఎస్‌ఎల్‌లోకి చర్చిల్ బ్రదర్స్ ఎంట్రీ: 
గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ క్లబ్‌కు దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఐ-లీగ్ (I-League) టైటిల్‌ను గతంలో రెండుసార్లు కైవసం చేసుకున్న ఈ దిగ్గజ క్లబ్, ఇప్పుడు జమ్‌షెడ్‌పూర్ ఎఫ్‌సీ సెటప్ ద్వారా నేరుగా దేశంలోనే అత్యున్నత ఫుట్‌బాల్ లీగ్ అయిన ISLలోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. 

రూ. 100 అనేది కేవలం చట్టబద్ధమైన డీల్ మాత్రమే: 
కార్పొరేట్ చట్టాల ప్రకారం ఒక కంపెనీని లేదా లైసెన్స్‌ను ఉచితంగా (Free Transfer) మరొకరికి బదిలీ చేయడం కుదరదు. అలా చేస్తే పన్నులు, ఇతర చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఒక ఒప్పందం న్యాయపరంగా చెల్లాలంటే అందులో కనీస కొనుగోలు మొత్తం (Nominal Consideration) ఉండాలి.. అందుకే కార్పొరేట్ రంగంలో ₹1 లేదా ₹100 లాంటి మొత్తాలను కేవలం టోకెన్ అమౌంట్‌గా నిర్ణయించడం సహజంగా జరిగే ప్రక్రియే.

►ALSO READ | గాలే పిచ్పై గందరగోళం.. శ్రీలంకతో టెస్ట్‌కు భారత జట్టు కాంబినేషన్ ఇదేనా?

రూ. 100 డీల్ వెనక అసలు కిటుకు ఇదే:  
పైకి చర్చిల్ బ్రదర్స్ ₹100 మాత్రమే చెల్లించినట్లు కనిపిస్తున్నప్పటికీ, దాంతో పాటు ఆ క్లబ్‌కు ఉన్న భారీ ఆర్థిక బాధ్యతలను తమ భుజాన వేసుకుంది. క్లబ్‌లోని 12 మంది ప్రధాన ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌ల భారీ జీతాల కాంట్రాక్టులను ఇకపై చర్చిల్ బ్రదర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్‌ఎల్‌లో ఒక సీజన్ ఆడటానికి ప్రయాణాలు, అకాడమీ నిర్వహణ, గ్రౌండ్ అద్దెలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు కలిపి ప్రతి ఏటా కోట్ల రూపాయల భారాన్ని ఇకపై చర్చిల్ బ్రదర్సే భరించాల్సి ఉంటుంది. 

నష్టాల నుంచి బయటపడటానికే టాటా స్టీల్ మాస్టర్ ప్లాన్: 
ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) లోని చాలా క్లబ్బులు స్వల్పకాలంలో భారీ నిర్వహణ నష్టాలను (Operational Losses) చవిచూస్తున్నాయి. టాటా స్టీల్ తమ ప్రధాన వ్యాపారమైన స్టీల్ తయారీ (Core Steel Business) పైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ప్రతి సంవత్సరం ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహణకు అయ్యే కోట్ల రూపాయల నష్టాన్ని భరించడం కంటే, అనుభవం ఉన్న క్లబ్‌కు అప్పగించడమే ఉత్తమమైన నిర్ణయంగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

క్లబ్ మూతపడకుండా.. లీగ్ లైసెన్స్ వృథా కాకుండా: 
ఒకవేళ టాటా స్టీల్ ఈ క్లబ్‌ను పూర్తిగా మూసివేసి ఉంటే (Liquidate), అక్కడ పని చేస్తున్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఉపాధి కోల్పోయేవారు. అంతేకాకుండా ఐఎస్‌ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యేది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ ఫుట్‌బాల్ చరిత్ర ఉన్న చర్చిల్ బ్రదర్స్‌కు క్లబ్‌ను అప్పగించడంతో ఆటగాళ్ల కాంట్రాక్టులు సురక్షితంగా ఉండటంతో పాటు జమ్‌షెడ్‌పూర్ FC ఐఎస్‌ఎల్ లైసెన్స్ కూడా వృథా కాకుండా ఉంటుంది.