Akka Trailer: గన్స్‌తో గర్జిస్తున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో భీకర పోరు!

Akka Trailer: గన్స్‌తో గర్జిస్తున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో భీకర పోరు!

ఓవైపు కంచుకోటలాంటి సామ్రాజ్యం.. మరోవైపు దాన్ని కూల్చేందుకు వచ్చిన శక్తిమంతమైన ప్రత్యర్థి.. గన్స్, గ్యాంగ్‌వార్, రక్తపాతం, ఆధిపత్య పోరాటాలతో నిండిన క్రైమ్ డ్రామా 'అక్క' (Akka). లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.  కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌లో ఇద్దరు పవర్‌ఫుల్ మహిళలు తలపడనున్నారు. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను యశ్‌రాజ్ ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

కథేంటి?

1980ల నేపథ్యంలో సాగే ఈ కథకు పెన్నూరు (Pernuru) అనే కల్పిత రాజ్యం వేదిక. గత 800 ఏళ్లుగా ఇక్కడ మహిళలదే ఆధిపత్యం. కుటుంబాలు, వ్యాపారాలు, నేర సామ్రాజ్యాలు సైతం వారి కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. కుటుంబంలో అత్యున్నత అధికారాన్ని చెలాయించే మహిళను 'అక్క'గా పిలుస్తారు. అలాంటి ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భవాని పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనున్నారు. తన గ్యాంగ్‌తో కలిసి ప్రత్యర్థులను గడగడలాడించే ఆమె అధికారానికి ఎదురులేనట్టే కనిపిస్తుంది.

రుద్ర ఎంట్రీతో మారనున్న ఆట..

భవాని సామ్రాజ్యాన్ని సవాలు చేస్తూ రుద్రగా రాధికా ఆప్టే రంగంలోకి దిగుతుంది. పాత వ్యవస్థను కూల్చాలనే లక్ష్యంతో అడుగుపెట్టిన ఆమె రాకతో పెన్నూరులో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఇద్దరి మధ్య మొదలైన పోరు కేవలం వ్యక్తిగత వైరం కాదు.. సంప్రదాయాలు, నమ్మకాలు, అధికారం, మనుగడకు సంబంధించిన యుద్ధంగా మారుతుంది. ట్రైలర్‌లో గన్స్, యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ఘర్షణలు ఆకట్టుకుంటున్నాయి.

ALSO READ :  చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. 

ధర్మరాజ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆయన దర్శకుడిగా తొలి ప్రాజెక్ట్. తన్వీ ఆజ్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కీర్తి, రాధికా తొలిసారి కలిసి తెరపై కనిపిస్తుండటంతో ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. మరి పెన్నూరుపై ఎవరి పట్టు నిలుస్తుంది? భవాని తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటుందా? రుద్ర ఆధిపత్యానికి తెరతీస్తుందా? సమాధానాల కోసం అక్టోబర్ 30 వరకు వేచి చూడాల్సిందే..