7 వేల800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు టెండర్లు

7 వేల800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు టెండర్లు

హైదరాబాద్: తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఇంధన నిల్వ సామర్థ్యాలను పెంపొందించే దిశగా టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO), టీజీజెన్‌కో (TGGENCO) సంస్థలు మొత్తం 7,800 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు టెండర్లను జారీ చేశాయి. ఈ టెండర్లకు సంబంధించి గురువారం (2026, అక్టోబర్ 22) హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా సుమారు 120 మంది, ప్రత్యక్షంగా 70 మంది చొప్పున మొత్తం 190 మంది వరకు బిడ్డర్లు పాల్గొన్నారు.

టెండర్ల వివరాలు:

TGREDCO ద్వారా 2,000 మెగావాట్ల FDRE:  స్థిరమైన, అవసరానికి అనుగుణంగా సరఫరా చేయగల పునరుత్పాదక విద్యుత్ (Firm and Dispatchable Renewable Energy) – RTC కొనుగోలుకు టెండర్లు జారీ చేశారు. కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లు కాగా, గరిష్ఠంగా 1,000 మెగావాట్ల వరకు బిడ్ దాఖలు చేయవచ్చు.

3,000 మెగావాట్ల సౌర విద్యుత్‌తో బ్యాటరీ నిల్వ వ్యవస్థ:  TGREDCO ఆధ్వర్యంలో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో 6,000 మెగావాట్ గంటల నిల్వ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ఏర్పాటు కోసం టెండర్లు జారీ చేశారు. కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లుగా నిర్ణయించారు.

800 మెగావాట్ల పవన విద్యుత్: TGREDCO ద్వారా 800 మెగావాట్ల పవన విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లు కాగా, గరిష్ఠ పరిమితి 400 మెగావాట్లుగా ఉంది.

TGGENCO ద్వారా 2,000 మెగావాట్ల BESS:  FDRE విధానంలో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ చేసి సరఫరా చేయగల నాలుగు యూనిట్లకు సమానమైన మొత్తం 2,000 మెగావాట్ల బ్యాటరీ నిల్వ వ్యవస్థ ఏర్పాటు కోసం టెండర్లు జారీ చేశారు.

ప్రీ-బిడ్ సమావేశంలో టెండర్ నిబంధనలు, ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి పలువురు బిడ్డర్లు సందేహాలు వ్యక్తం చేశారు. వారు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్చించి, సాధ్యమైన మేరకు వివరణలు అందించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, బిడ్డర్ల సందేహాలు, అభ్యంతరాలను పరిశీలించి తగిన సమాధానాలు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ రెడ్‌కో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ మాట్లాడుతూ, టెండర్ల ప్రక్రియలో వర్తించే నిబంధనలు, నియమావళిని పాటిస్తున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) విజయవంతంగా నిర్వహించిన టెండర్లలో అనుసరించిన విధానాలు, ప్రక్రియలను అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, తెలంగాణ జెన్‌కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హరీశ్ ఐఏఎస్ మాట్లాడుతూ, పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ను సమకూర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బిడ్డర్లు తమ సందేహాలు, సూచనలను మెయిల్ చేయాలని, అందిన ప్రశ్నలు, అభ్యంతరాలను పరిశీలించి తగిన వివరణలు అందిస్తామని భరోసా ఇచ్చారు.