మెదక్: పాత కక్షలతో యువకుడిని హత్య చేసిన కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. 2026 అక్టోబర్ 22న వెలువరించిన తీర్పులో నిందితులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ వెల్లడించారు.
నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జెల్లా రాజారామ్ గౌడ్, యాడరం నాగరాజు గౌడ్ కుటుంబాల మధ్య పాత కక్షల కారణంగా గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాలపై నిజాంపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
2020 మే 20న ఉదయం సుమారు 6.30 గంటలకు రాజారామ్ గౌడ్ కుమారుడు జెల్లా నర్సింలు గౌడ్ (28) గ్రామ శివారులోని బీడు భూమిలో తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని రాజారామ్ గౌడ్ గుర్తించారు. వెంటనే అతడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి నిజాంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి, రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించగా, ప్రస్తుత దర్యాప్తు అధికారి సైదా, నిజాంపేట ఎస్ఐ సహకారంతో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.
జీవిత ఖైదు పడిన నిందితులు:
యాడరం నాగరాజు గౌడ్, బంధారం లక్ష్మీ నారాయణ గౌడ్, బంధారం నాగరాజు గౌడ్, బంధారం నవీన్ గౌడ్, బంధారం గణేష్ గౌడ్, యాడరం శేఖర్ గౌడ్, యాడరం రమేష్ గౌడ్.
ALSO READ : డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్..
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య, కోర్టు లైజన్ ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్, నిజాంపేట సీడీఓ మహేష్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా ప్రతి కేసులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
