- 27 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడొచ్చని ఐఎండీ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. సముద్రంలో వరుసగా ఏర్పడుతున్న ఆవర్తనాలతో తుఫాన్ ఏర్పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మయన్మార్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తోందని వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈ నెల 23 నాటికి తూర్పు–మధ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 26 నాటికి తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి.
గురువారం నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, 26న తుఫాను ఏర్పడితే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లోనూ వాతావరణం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.
